Airtel: టీవీ ఛానళ్లు, ఓటీటీతో ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ఫైబర్‌లో 2 కొత్త ప్లాన్లు

Airtel: ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌లో మరిన్ని ప్లాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు దీంట్లో నెలవారీ రూ.799 ప్లాన్‌ మాత్రమే ఉండేది. తాజాగా టీవీ, ఓటీటీ ప్రయోజనాలతో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది.

Published : 12 Mar 2024 14:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీ ఎయిర్‌టెల్‌ తమ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ కస్టమర్ల కోసం మరో రెండు కొత్త ప్లాన్లను (Aitel extreme airfiber Plans) తీసుకొచ్చింది. వీటి ధర నెలకు రూ.699, రూ.999. వీటిలో 350 లైవ్‌ టీవీ ఛానెళ్లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే యాక్సెస్‌ లభిస్తుంది. వేగవంతమైన వైర్‌లెస్‌ 5జీ ఇంటర్నెట్‌ సేవలను అందించడం కోసం ఎయిర్‌టెల్‌ గత ఏడాది ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

తాజాగా తీసుకొచ్చిన రూ.699 ప్లాన్‌తో 40ఎంబీపీఎస్‌ వేగంతో నెలకు 1 టీబీ డేటా లభిస్తుంది. రూ.999 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్‌ వేగాన్ని పొందొచ్చు. ఈ పరిమితి ముగిసిన తర్వాత 2 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లలో ఏది తీసుకున్నా 4కే ఆండ్రాయిడ్‌ సెటప్ బాక్స్‌ వస్తుంది. దాంతో 350 లైవ్‌ టీవీ ఛానెళ్లను పొందొచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. ఎక్స్‌ట్రీమ్‌ ప్లేలో సోనీలివ్‌, ఈరోస్‌నౌ, లయన్స్‌గేట్‌ ప్లే, అల్ట్రా, మనోరమా మ్యాక్స్, హంగామా ప్లే సహా మొత్తం 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

ఇప్పటికే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌లో రూ.799 ప్లాన్‌ ఉంది. దీంట్లో 100 ఎంబీపీఎస్‌ వేగంతో 1టీబీ డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంటుంది. కొత్త కస్టమర్లు ఈ మూడు ప్లాన్లలో ఏదైనా 6 లేదా 12 నెలల ప్యాకేజీతో తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి జీఎస్టీ అదనం. ఇన్‌స్టలేషన్‌ ఛార్జీ కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది ప్యాకేజీ ఎంచుకుంటే దీన్ని రద్దు చేస్తారు.

ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ అనేది ప్లగ్‌ అండ్‌ ప్లే డివైజ్‌. వైఫై 6 టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. గరిష్ఠంగా దీనికి 64 డివైజులను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయొచ్చు. ఫైబర్‌ డివైజ్‌ కొనుగోలు చేశాక ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. డివైజ్‌ మీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని