Airtel: ఎన్నికల తర్వాత ఎయిర్‌టెల్‌ టారిఫ్‌ల పెంపు..!

Airtel tariffs: టెలికాం ఛార్జీల ధరలను పెంచేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధమవుతోంది. జియో మాత్రం కొత్త పంథాలో వెళ్లాలని భావిస్తోంది.

Published : 25 Mar 2024 17:52 IST

Airtel | ఇంటర్నెట్ డెస్క్‌: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తమ టారిఫ్‌లను సవరించేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈవిషయంలో అగ్రగామి సంస్థలైన ఎయిర్‌టెల్‌, జియో తమదైన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నాయి. తమ ప్లాన్‌ ధరలను పెంచడం ద్వారా ఒక యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవాలని ఎయిర్‌టెల్‌ (Airtel) భావిస్తోంది. ప్యాకేజీ ధరలు పెంచకుండా డేటా వినియోగాన్ని మరింత పెంచి తద్వారా అధిక ధరలు కల ప్యాకేజీల వైపు వినియోగదారులను మళ్లించాలన్నది జియో (Jio) ఆలోచనగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్‌ ప్లాన్లు ఇప్పటికే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ముందునుంచీ ఆ కంపెనీ తన ఆర్పును (ARPU) క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. జియో సగటు ఆదాయం మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ నడుస్తోంది. దీనివల్ల డేటా వినియోగం పెరుగుతుందని, తద్వారా లాభం పొందొచ్చని జియో భావిస్తోంది. జియో సినిమా ప్రసారాలు ఉచితంగానే యూజర్లకు రిలయన్స్‌ అందిస్తోంది. అయితే, వీక్షణ అనుభూతిని మెరుగుపరుచుకోవడం కోసం యూజర్లు అధిక డేటా వెచ్చిస్తారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నట్లు ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ తన కథనంలో పేర్కొంది. దీనివల్ల టారిఫ్‌ ధరలను పెంచకుండానే అధిక ఆర్పును సాధించొచ్చన్నది జియో వ్యూహంగా కనిపిస్తోందని అనలిస్టులు చెబుతున్నారు.

షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో

ఎయిర్‌టెల్‌ మాత్రం తన ఆర్పును పెంచుకోవడానికి ప్లాన్ ధరల్లో మార్పును ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికలు పూర్తవగానే ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జులై-అక్టోబర్‌ మధ్య 15 శాతం వరకు టారిఫ్‌లను పెంచొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఆర్పు రూ.208గా ఉంది. ఇక జియో ఆర్పు రూ.182 కాగా.. వొడాఫోన్‌ ఐడియా రూ.145గా ఉంది. మార్కెట్‌ వాటా పరంగా జియో అగ్రగామిగా ఉంది. ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంది. 18 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని