Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!

Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు.

Updated : 25 Mar 2024 13:41 IST

బీజింగ్‌: వాహన తయారీలోకి ప్రవేశించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల సంస్థ షావోమి (Xiaomi) గురువారం నుంచి తమ తొలి కారు మోడల్‌కు ఆర్డర్లు స్వీకరించనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ లీ జున్‌ సోమవారం కీలక విషయాలు వెల్లడించారు. ఆకర్షణీయ లుక్‌, డ్రైవ్‌ చేయడానికి సులభంగా ఉండే స్మార్ట్‌ కారును తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ధర 5,00,000 యువాన్ల (దాదాపు రూ.58 లక్షలు) కంటే తక్కువే ఉంటుందని తెలిపారు.

స్పీడ్‌ అల్ట్రా 7గా (Xiaomi SU7) పేర్కొంటున్న షావోమి కొత్త కారుకు చైనాలో గురువారం నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆరోజే అధికారిక ధరలను వెల్లడించనున్నారు. డిసెంబరులో ఆవిష్కరించినప్పటి నుంచి ఈ కారుపై ఆసక్తి నెలకొంది. ప్రపంచంలో తొలి ఐదు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా నిలవడమే తమ లక్ష్యమని షావోమి అప్పట్లో ప్రకటించింది. టెస్లా, పోర్షే విద్యుత్తు కార్ల కంటే కూడా దీంట్లో మెరుగైన సాంకేతికతను వాడినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

సోమవారం నుంచి చైనాలో షావోమి స్టోర్లు ఎస్‌యూ7 కార్లను ప్రదర్శనకు ఉంచడం ప్రారంభించాయి. ఓషియన్‌ బ్లూ రంగులో ఉన్న ఈ కారును దగ్గరి నుంచి పరిశీలించడానికి చాలా మంది స్టోర్లకు వస్తున్నారు. మరోవైపు షావోమి కార్‌ యాప్‌ను కంపెనీ చైనా యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉంచింది.

ఎస్‌యూ7 రెండు వెర్షన్లలో వస్తోంది. ఒక దాని రేంజ్‌ 668 కిలోమీటర్లు కాగా.. మరొకటి ఒకసారి ఛార్జ్‌ చేస్తే 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ సాచురేషన్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో షావోమి క్రమంగా ఈవీ రంగంలోకి ప్రవేశిస్తోంది. వచ్చే పదేళ్లలో 10 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ప్రకటించింది. దీని కార్లను ప్రభుత్వ సంస్థ బీఏఐసీ గ్రూప్‌ తయారు చేస్తోంది. చైనాకు చెందిన టెలికాం కంపెనీ హువావే, సెర్చ్‌ ఇంజిన్‌ బైడూ సైతం ఈవీల కోసం వాహన తయారీ సంస్థలతో జట్టుకట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని