Social Media X: ‘ఎక్స్‌’ ప్రీమియంలో కొత్త ఫీచర్‌.. ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’కు యాక్సెస్‌

Social Media X: ఎక్స్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్ల కోసం ఎలాన్‌ మస్క్‌ మరో కొత్త ఫీచర్‌ను అందిస్తున్నారు. 

Updated : 27 Mar 2024 10:27 IST

కాలిఫోర్నియా: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు (Elon Musk) చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మరో కొత్త ఫీచర్‌ రానుంది. కృత్రిమ మేధ సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ అభివృద్ధి చేసిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ (Grok)ను వచ్చేవారం నుంచి ప్రీమియం చందాదారులందరికీ అందించనున్నట్లు మస్క్‌ మంగళవారం వెల్లడించారు. ఇప్పటి వరకు ఇది కేవలం ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

‘ఎక్స్‌’ను (Social Media X) వాడుతున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో మస్క్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ సామాజిక మాధ్యమానికి వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం సైతం పడిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సబ్‌స్క్రైబర్ల ద్వారా వచ్చే ఆదాయంతో నష్టాన్ని పూడ్చుకునేందుకు మస్క్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా గ్రోక్‌ను (Grok) ఎక్స్‌కు అనుసంధానిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఫిబ్రవరి నాటికి అమెరికాలో ఎక్స్‌ను వాడుతున్న వారి సంఖ్య వార్షిక ప్రాతిపదికన 18 శాతం తగ్గినట్లు ఇటీవల సెన్సర్‌ టవర్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ సామాజిక మాధ్యమాన్ని మస్క్‌ కొనుగోలు తర్వాత యూజర్ల సంఖ్య 23 శాతం పడిపోయినట్లు తెలిపింది.

మరోవైపు చాట్‌జీపీటీ సహా మార్కెట్‌లో ఉన్న ఇతర ఏఐ చాట్‌బాట్‌లకు పోటీగా గ్రోక్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎక్స్‌కు అనుసంధానించడం వల్ల ఈ చాట్‌బాట్‌కూ ఆదరణ పెరుగుతుందని మస్క్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని