Andy Jassy: కెరీర్‌ సక్సెస్‌కు అమెజాన్‌ సీఈవో ఏకైక సలహా!

Andy Jassy Success Tip: కెరీర్‌లో సక్సెస్‌ కావడానికి ప్రతిఒక్కరిలో ఉండాల్సిన ఓ లక్షణాన్ని అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ పంచుకున్నారు. అది జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో వివరించారు.

Published : 24 May 2024 15:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెరీర్‌లో సక్సెస్‌ కావాలంటే కష్టపడి పనిచేసే తత్వం, వేగంగా నేర్చుకోవడం, స్మార్ట్‌గా వ్యవహరించడం, మంచి కమ్యూనికేషన్‌.. ఇలా రకరకాల లక్షణాలు అవసరమని చెబుతుంటారు. అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ (Andy Jassy) మాత్రం ‘సానుకూల దృక్పథం’ వీటన్నింటి కంటే ముఖ్యమని సూచించారు. కెరీర్‌ ప్రారంభించిన మొదట్లో  ప్రతిఒక్కరూ పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఉండాలని.. అదే విజయతీరాలకు చేర్చుతుందని తెలిపారు. లింక్డిన్‌ సీఈవో ర్యాన్ రోస్లాన్‌స్కీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.

సానుకూల దృక్పథం అంటే కేవలం ఉల్లాసంగా ఉండడం మాత్రమే కాదని జస్సీ (Amazon CEO Andy Jassy) అభిప్రాయపడ్డారు. నమ్మకమైన సహచరుడిగా ఉండడం, గడువులోగా లక్ష్యాల్ని చేరుకోవడం, సాధించగలననే స్ఫూర్తి వంటి లక్షణాలన్నీ అందులో భాగమని వివరించారు. సరైన మనస్తత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిఒక్కరూ తమకి తాము ఈ కింది ప్రశ్నలు సంధించుకోవాలని సూచించారు.

  • కష్టపడి పని చేస్తున్నానా? 
  • పదే పదే ఫిర్యాదు చేయడం కాకుండా ఆశావహ దృక్పథంతో ముందుకెళ్తున్నానా?
  • ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానా?
  • సమర్థంగా, సమన్వయంతో ముందుకెళ్లగలనా?

ఈ ప్రశ్నలకు ప్రతిఒక్కరి వద్ద సమాధానం ఉండాలని జస్సీ హితవు పలికారు. ఇవి సులువుగానే అనిపించినప్పటికీ చాలామంది వీటిని విస్మరిస్తున్నారని గుర్తుచేశారు. ‘‘సానుకూల వైఖరి వల్ల విశ్వాసం పెంపొందుతుంది. కొత్త సవాళ్లను స్వీకరించే సామర్థ్యం వస్తుంది. వీటివల్ల వచ్చే ఫలితాలు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి’’ అని ఆయన వివరించారు. కెరీర్‌లో ఏ దశలో ఉన్నప్పటికీ.. పాజిటివ్‌ యాటిట్యూడ్‌ వల్ల ‘‘పని ప్రదేశంలో సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాంటి వారికి అందరూ ఆకర్షితులవుతారు. వాళ్లు సక్సెస్‌ కావాలని కోరుకుంటారు. ఫలితంగా కెరీర్‌లో విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి’’ అని జస్సీ తెలిపారు. నైపుణ్యాలు, తెలివితేటలు అవసరమైనప్పటికీ.. మిగతావాళ్లతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉండేందుకు సానుకూల దృక్పథం దోహదం చేస్తుందని వివరించారు.

ప్రణాళికతోనే ఆర్థిక విజయం

పాజిటివ్‌ యాటిట్యూడ్‌ వల్ల వచ్చే సక్సెస్‌కు అమెజాన్‌లో (Amazon) జస్సీ ప్రయాణమే ఉదాహరణ అని పలువురు టెక్‌ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 1997లో 29 ఏళ్ల వయసులో అమెజాన్‌లో మార్కెటింగ్‌ మేనేజర్‌గా ఆయన కెరీర్‌ ప్రారంభమైంది. ఐదేళ్లలోనే కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు సలహాదారుడిగా మారారు. తొలుత దీన్ని ఆయన సహచరులు వ్యతిరేకించారు. కానీ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం కోసం జస్సీ దీన్నొక అవకాశంగా మల్చుకున్నారు. ఒకవేళ బెడిసికొట్టినా.. గొప్ప అనుభవంగా మిగిలిపోతుందని భావించానని స్వయంగా ఆయనే ఓ సందర్భంలో వెల్లడించారు. అంతా సజావుగా సాగితే మాత్రం అసమానమైన అనుభవం తన సొంతమవుతుందని భావించానన్నారు. ఆశించినట్లుగానే ఆ పాత్ర ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు