Financial success: ప్రణాళికతోనే ఆర్థిక విజయం

జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. వాటిని అందుకోవడానికి సరైన ఆర్థిక ప్రణాళికలు ఉండాల్సిందే. క్రమశిక్షణతో వాటిని అమల్లో పెట్టినప్పుడే అనుకున్న పనుల్లో విజయం సాధించగలం.

Published : 24 May 2024 00:44 IST

జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. వాటిని అందుకోవడానికి సరైన ఆర్థిక ప్రణాళికలు ఉండాల్సిందే. క్రమశిక్షణతో వాటిని అమల్లో పెట్టినప్పుడే అనుకున్న పనుల్లో విజయం సాధించగలం. కాస్త నిర్లక్ష్యం చేసినా లక్ష్యం చేరుకునేందుకు ఆలస్యం అవుతూనే ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే.

సంపాదించేది ఖర్చు పెట్టడానికే.. కానీ మొత్తం సంపాదనను నేడే ఖర్చు చేస్తే ఎలా? రేపటి అవసరాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఎలాంటి అవసరాలు వచ్చినా ఇబ్బంది పడకుండా ఉండేందుకు మాత్రం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. ఉన్న సొమ్ములో నుంచే ఎంతో కొంత పొదుపు/మదుపు చేయడం తప్పనిసరి.

క్రెడిట్‌ కార్డులను వినియోగిస్తున్న వారెందరో. ఒక రకంగా ఇవి కొన్నిసార్లు ప్రయోజనమే. కానీ, చాలామంది ఖర్చుల మీద నియంత్రణ కోల్పోయేందుకూ ఇవి కారణమవుతున్నాయి. క్రెడిట్‌ కార్డుల ద్వారా వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఫలితంగా కొందరు విలాసవంతమైన వస్తువులనూ కొనుగోలు చేసేందుకు వెనకాడటం లేదు. విలువను లెక్కచేయకుండా వాయిదాల పద్ధతిలో నెలకు ఎంత చెల్లించాలి అనేదే చూస్తున్నారు. ఇలాంటి వారందరూ మర్చిపోతున్న విషయం ఏమిటంటే.. నెల జీతంలో అది ఎంత శాతం వరకూ ఉంటుందన్నది. దాదాపు 6-12 నెలల పాటు వాయిదాలు చెల్లించాలంటే.. మీ ఆర్థిక ప్రణాళికలపై దాని భారం ఎంత మేరకు ఉందన్నది గమనించాలి. మీ పెట్టుబడి సామర్థ్యాన్ని అది తగ్గిస్తుందని మర్చిపోవద్దు. పెట్టుబడులను త్యాగం చేసి, అంతగా అవసరం లేని వస్తువులను కొనడం భావ్యమేనా అన్నది ఆలోచించుకోవాలి. మరీ అవసరమైన వస్తువులను కొనడం తప్పదనుకోండి.

అవగాహన పెంచాలి..

ఆర్థిక ప్రణాళికలు అంటే కుటుంబంలో ఒక్క వ్యక్తికే పరిమితం కాదు. జీవిత భాగస్వామి, పిల్లలకూ ఇందులో భాగస్వామ్యం ఉండాలి. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ సంపాదన, ఖర్చులు, పెట్టుబడులు ఇతర వివరాల గురించి తెలిసి ఉండాలి. మీ ఆర్థిక లక్ష్యాలు, వాటిని సాధించేందుకు వేసుకున్న ప్రణాళికలు అందరికీ తెలిసి ఉండాలి. అనుకోని కష్టం వస్తే ఏం చేయాలన్నదీ వారికి తెలిసి ఉండాలి. ప్రణాళికలు అందరికీ తెలిస్తే.. ఇంట్లో ఖర్చులూ తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలకు డబ్బు గురించి ఎందుకు చెప్పడం అనేది ఇప్పటికీ చాలామంది భావన. కానీ, పదేళ్లకు మించిన పిల్లలకు డబ్బు గురించి తప్పనిసరిగా అవగాహన పెంచాలి. వారి కోసం ప్రత్యేకంగా బ్యాంకులు పొదుపు ఖాతాలనూ అందిస్తున్నాయి. వాటిని ప్రారంభించాలి. చిన్నప్పటి నుంచే వారికి డబ్బు మీద అవగాహన పెంచితే, వారూ పొదుపు చేసేందుకు ఆకర్షితులవుతారు.

వైవిధ్యంగా..

ఆర్జించే కొత్తలో నష్టభయాన్ని తట్టుకునేందుకు వీలుంటుంది. కాబట్టి, ఈక్విటీ ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెట్టినా ఇబ్బంది ఉండదు. అది అన్ని వేళలా.. అందరికీ సరిపోకపోవచ్చు. కొంతమందికి చిన్న వయసులోనే అనేక బాధ్యతలు ఉంటాయి. ఇలాంటి వారు అధిక నష్టభయం ఉన్న పథకాలకు దూరంగా ఉండాలి. ఈక్విటీ ఆధారిత పథకాలతోపాటు డెట్‌ పథకాలనూ ఎంచుకోవాలి. పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పటిప్పుడు పెట్టుబడులను సమీక్షిస్తూ ఉండాలి. హెచ్చుతగ్గులను బట్టి, పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు ఉండాలి.

ఈక్విటీల్లో పెట్టుబడికి చాలామంది ఏటా ఒకే తరహా రాబడిని అంచనా వేస్తుంటారు. గత మూడేళ్లుగా ఈక్విటీ పెట్టుబడులు మంచి రాబడి ఇచ్చాయన్న సంగతి తెలిసిందే. కానీ, భవిష్యత్‌లో ఇదే పునరావృతం అవుతుందని చెప్పలేం. ఒకవేళ ఇలాంటి రాబడి రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మంచి రాబడిని అందించాలంటే.. దీర్ఘకాలం వేచి చూడాల్సిందే. అందుకే, వీటిని దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలని అంటారు. కనీసం 5-7 ఏళ్ల వ్యవధి కొనసాగే ఓపిక లేకుండా ఈక్విటీలవైపు వెళ్లకూడదు.

చరిత్రను గమనిస్తే.. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలంలో 12-15 శాతం వరకూ రాబడినిచ్చిన విషయం తెలుస్తుంది.

కాలక్రమేణా ఆదాయంలోనూ, బాధ్యతల్లోనూ మార్పులు వస్తుంటాయి. వీటికి అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు మారుతూ ఉండాలి. అప్పుడే పెరుగుతున్న ఖర్చులను తట్టుకుంటూ.. జీవితాన్ని సౌకర్యవంతంగా కొనసాగించగలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని