Ambani - Adani: తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా

అంబానీ, అదానీ తొలిసారి చేతులు కలిపారు. ఓ పవర్‌ ప్రాజెక్ట్‌ విషయంలో వీరి మధ్య భాగస్వామ్యం కుదిరింది.

Published : 28 Mar 2024 20:26 IST

Ambani - Adani | దిల్లీ: ఇద్దరూ ప్రముఖ వ్యాపార వేత్తలు. దేశంలో అత్యంత ధనవంతులు. పైగా గుజరాత్‌ నుంచి వచ్చిన వారే. వ్యాపార దిగ్గజాలైన అంబానీ, అదానీ (Ambani - Adani) గురించి చెప్పాలంటే ఇంతకంటే ఉపోద్ఘాతం అవసరం లేదేమో బహుశా! వీరిద్దరూ ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నా ఎవరి వ్యాపారాలు వారివి. ఎవరి వ్యూహాలు వారివి. అలాంటి వారు తొలిసారి చేతులు కలిపారు. అదానీకి చెందిన ఓ పవర్‌ ప్రాజెక్ట్‌లో రిలయన్స్‌ తాజాగా 26 శాతం వాటా కొనుగోలు చేసింది. తద్వారా కుబేరుల మధ్య తొలిసారి వ్యాపార భాగస్వామ్యం నెలకొంది.

అదానీ పవర్‌ లిమిటెడ్‌కు చెందిన మధ్యప్రదేశ్‌లోని మహాన్‌ ఎనర్జెన్‌ లిమిటెడ్‌లో రిలయన్స్‌ 5 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. 500 మెగావాట్ల విద్యుత్‌ను తమ సొంత అవసరాలకు (క్యాప్టివ్‌) వినియోగించుకోనుంది. ఈ విషయాన్ని ఇరు సంస్థలూ వేర్వేరు స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొన్నాయి. 20 ఏళ్లకు రిలయన్స్‌తో పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదురినట్లు అదానీ పవర్‌ తన ఫైలింగ్‌లో పేర్కొంది. 2800 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగిన పవర్‌ ప్లాంట్‌లో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌ను క్యాప్టివ్‌ యూనిట్ కోసం కేటాయించినట్లు తెలిపింది.  ఇవే వివరాలను రిలయన్స్‌ సైతం తన ఫైలింగ్‌లో వెల్లడించింది. సాధారణంగా క్యాప్టివ్‌ జనరేటింగ్‌ ప్లాంట్ నుంచి సొంత అవసరాలకు విద్యుత్‌ను వినియోగించాలంటే ఆ కంపెనీలో 26 శాతం వాటా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ పవర్‌ను దేనికోసం రిలయన్స్‌ వినియోగించబోయేదీ స్పష్టత లేదు. ఇప్పటికే గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో రిలయన్స్‌కు క్యాప్టివ్‌ యూనిట్లు ఉన్నాయి.

గూగుల్‌ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్‌ గాలం?

టాప్‌ కోసం పోటీ..

ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ.. ఏళ్లుగా వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నారు. అంబానీ.. ఆయిల్‌, గ్యాస్‌, రిటైల్‌, టెలికాం విభాగాలపై దృష్టి సారించగా.. అదానీ ఇన్‌ఫ్రా, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, మైనింగ్‌ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇరు సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే రెండు సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రకటించాయి. 5జీ స్పెక్ట్రమ్‌ విషయంలోనూ ఇరు సంస్థలు పోటీ పడ్డాయి. అదానీ కంపెనీ ప్రజావసరాల కోసం వినియోగించే స్పెక్ట్రమ్‌ జోలికెళ్లలేదు. ఇక ఎన్డీటీవీని టేకోవర్‌ చేయడం ద్వారా అదానీ గ్రూప్‌ మీడియా రంగంలోకీ ప్రవేశించింది. తద్వారా మీడియా రంగంలోనూ ఇరువురి మధ్య పోటీ నెలకొంది. ఆసియాలోనే సంపన్నుల జాబితాలో నంబర్‌ 1 స్థానం కోసం వీరిద్దరూ పోటీ పడుతున్న వేళ ఈ కొనుగోలు జరగడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని