Forbes Richest List: ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలోనూ అంబానీయే టాప్‌

Forbes Richest List: ఇటీవల విడుదలైన హురున్‌ ధనవంతుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ.. తాజా ఫోర్బ్స్‌ రిచ్‌లిస్ట్‌లోనూ వారి స్థానాలను పదిలం చేసుకున్నారు.

Updated : 12 Oct 2023 20:05 IST

Forbes Richest List | దిల్లీ: ఫోర్బ్స్‌ 100 మంది సంపన్న భారతీయుల జాబితా 2023 (Forbes India Richest List 2023)లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) మళ్లీ తొలి స్థానానికి చేరారు. ఈ ఏడాది ఆయన సంపద నాలుగు బిలియన్‌ డాలర్లు పెరిగి 92 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఆయన తర్వాత అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) 68 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ (Shiv Nadar) (29.3 బిలియన డాలర్లు), ఓపీ జిందాల్‌ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్‌ (24 బిలియన్‌ డాలర్లు), అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ రాధాకిషన్‌ దమానీ (23 బిలియన్‌ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023’లోనూ అంబానీ, అదానీ తొలి రెండు స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది భారత 100 మంది ధనవంతుల సంపదలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. క్రితం ఏడాది వీరందరి సంపద మొత్తం 799.32 బిలియన్‌ డాలర్లు. ఈసారి అది అత్యంత స్వల్పంగా పెరిగి 799.78 బిలియన్‌ డాలర్లకు చేరింది. స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో గణనీయ వృద్ధే నమోదైనప్పటికీ.. రూపాయి బలహీనతల వల్ల సంపదలో వచ్చిన పెరుగుదలకు గండిపడిందని ఫోర్బ్స్‌ తెలిపింది. ఈ జాబితా ప్రకారం సావిత్రి జిందాల్‌ భారత్‌లో అత్యంత మహిళా ధనవంతురాలు. ఈసారి ఏడుగురు తిరిగి ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. బైజూ రవీంద్రన్‌, ఆయన సతీమణి దివ్యా గోకుల్‌నాథ్ సహా మరో ఎనిమిది మంది ఈ జాబితాలో స్థానం కోల్పోయారు.

ఫోర్బ్స్‌ 100 మంది సంపన్న భారతీయుల జాబితాలో కొత్తగా కేవలం ముగ్గురు మాత్రమే చేరారు. ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ రేణుకా జగతియానీ, ఏషియన్‌ పెయింట్స్‌కు చెందిన ‘దానీ’ కుటుంబం, వస్త్ర ఎగుమతి వ్యాపారంలో ఉన్న కే.పి రామస్వామి వీరిలో ఉన్నారు. 40 ఏళ్ల వయసున్న జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ ఈ జాబితాలో అత్యంత పిన్నవయస్కుడు. తన సోదరుడు నితిన్‌ కామత్‌తో కలిసి ఆయన సంపద విలువ 5.5 బిలియన్‌ డాలర్లు.

ఫోర్బ్స్‌ జాబితాలోని తొలి 10 మంది సంపన్నులు..

1. ముకేశ్‌ అంబానీ- 92 బి.డాలర్లు

2. గౌతమ్‌ అదానీ- 68 బి.డాలర్లు

3. శివ్‌ నాడార్‌- 39.3 బి.డాలర్లు

4. సావిత్రి జిందాల్‌- 24 బి.డాలర్లు

5. రాధాకిషన్‌ దమానీ- 23 బి.డాలర్లు

6. సైరస్‌ పూనావాలా- 20.7 బి.డాలర్లు

7. హిందుజా కుటుంబం- 20 బి.డాలర్లు

8. దిలీప్‌ సంఘ్వి- 19 బి.డాలర్లు

9. కుమార మంగళం బిర్లా- 17.5 బి.డాలర్లు

10. షాపూర్‌ మిస్త్రీ & కుటుంబం- 16.9 బి.డాలర్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని