Anant Ambani: అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌.. 2500 రకాల వంటకాలు..!

Anant Ambani-Radhika Merchant pre wedding: అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ ముందస్తు వివాహ వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అతిథులకు దాదాపు 2,500 రకాల రుచికరమైన వంటకాలను వడ్డించనున్నారట..!

Published : 27 Feb 2024 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెలబ్రిటీల వివాహాలంటే ప్రతీ విషయమూ ఆసక్తికరమే. అదే అపర కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి అంటే ఆ విశేషాలు మామూలుగా ఉండవు కదా..! అందుకే, అనంత్‌ అంబానీ (Anant Ambani)-రాధికా మర్చంట్‌ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్‌ వేడుక గురించి రోజుకో ప్రత్యేకత బయటికొస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అతిథులకు ఏకంగా 2,500 వంటకాలను వడ్డించనున్నారట..! ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్‌ చేయకుండా ఆహ్వానితులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ (Mukesh Ambani), నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. జులైలో వీరి పెళ్లి జరగనుండగా, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలను నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌.. ఈ విశేషాలు తెలుసా..!

ఈ మూడు రోజుల పాటు అతిథులకు వడ్డించేందుకు ప్రత్యేక మెనూ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ లోని ఇందౌర్‌ నుంచి 21 మంది చెఫ్‌లను పిలిపించినట్లు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఆహ్వానితులకు భారతీయ వంటకాలతో పాటు జపనీస్‌, మెక్సికన్‌, థాయ్‌, పార్సీ ఇలా పలు సంప్రదాయ వంటలను రుచి చూపించనున్నారు. మొత్తంగా 2,500 వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు.

బ్రేక్‌ఫాస్ట్‌లో 75 వెరైటీలు, లంచ్‌లో 225, డిన్నర్‌లో 275 రకాల వంటకాలను వడ్డించనున్నారు. మిడ్‌నైట్‌ స్నాక్స్‌ కూడా ఏర్పాటుచేయనున్నారట. అర్ధరాత్రి 12 నుంచి 4 గంటల వరకు 85 వంటకాల్లో అతిథులు ఏది కోరుకుంటే అది అందించనున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. కచోరీ, పోహా, జిలేబీ, భుట్టె కా కీస్‌, ఖోప్రా ప్యాటిస్ తదితర ఇందౌరీ వంటకాలను ప్రత్యేకంగా చేయించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని