Play store: యాప్‌ల తొలగింపు సరికాదు.. గూగుల్‌ చర్యపై కేంద్రం

Google play store: గూగుల్‌ ప్లేస్టోర్‌లో యాప్‌ల తొలగింపుపై కేంద్రం స్పందించింది. ఆ యాప్‌లను డీలిస్ట్‌ చేయడం సరికాదని పేర్కొంది.

Updated : 02 Mar 2024 16:08 IST

Google play store | దిల్లీ: గూగుల్‌ ప్లేస్టోర్‌ (Google Play Store) వ్యవహారంపై కేంద్రం స్పందించింది. సర్వీసు ఫీజు చెల్లించని కారణంగా గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి కొన్ని యాప్స్‌ను తొలగించడాన్ని తప్పుబట్టింది. టెక్‌, స్టార్టప్‌ కంపెనీలకు చెందిన యాప్స్‌ను తొలగించడం ఏమాత్రం సరికాదని ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. వచ్చేవారం ఇరుపక్షాలతో సమావేశం నిర్వహించనున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ గుండెకాయ లాంటిదని వైష్ణవ్‌ చెప్పారు. అలాంటి స్టార్టప్‌ల తలరాతలను బిగ్‌ టెక్‌ కంపెనీలు నిర్ణయించకూడదన్నారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. యాప్‌లను డీలిస్ట్‌ చేయడాన్ని ఏమాత్రం అంగీకరించబోమన్నారు. ‘‘ఈ విషయంలో మా వైఖరి స్పష్టం. స్టార్టప్స్‌ అవి కోరుకునే రక్షణ కల్పించడం ముఖ్యం’’ అని చెప్పారు. డీలిస్టింగ్‌ వ్యవహారంపై గూగుల్‌, యాప్‌ డెవలపర్లతో వచ్చేవారం సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఇప్పటికే ఇరుపక్షాలతో మాట్లాడానని చెప్పారు. భారత్‌లో గత పదేళ్లలో బలమైన స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పడిందన్నారు. ఒక లక్ష స్టార్టప్‌లు రూపుదిద్దుకోగా.. 100 యూనికార్న్‌లు అవతరించాయని చెప్పారు. ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలూ అవతరించారన్నారు. అలాంటివారు బిగ్‌ టెక్‌ కంపెనీల విధానాలకు బలి అవకూడదని పేర్కొన్నారు.

Credit card: క్రెడిట్‌ కార్డ్‌ రివార్డు పాయింట్లు పెంచుకోవడమెలా?

15-30 శాతంగా ఉన్న ఛార్జీల వ్యవస్థను తొలగించాలని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆదేశాలు జారీ చేయడంతో గూగుల్‌ ప్రస్తుతం 11-26% ఫీజు వసూలు చేస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గూగుల్‌ ప్లే స్టోర్‌ను మాట్రిమోనీ.కామ్‌, షాదీ.కామ్‌, ఇన్ఫోఎడ్జ్‌, అనాకడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్‌, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్‌, స్టేజ్‌, కుటుంబ్‌, టెస్ట్‌బుక్‌ వంటి కంపెనీలు సవాలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో తమ ప్లాట్‌ఫాం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ.. 10 కంపెనీలు ఫీజులను చెల్లించట్లేదని గూగుల్‌ పేర్కొంది. ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించిందని తెలిపింది. ఈక్రమంలోనే షాదీ, మేట్రిమోనీ, భారత్‌ మేట్రిమోనీ, బాలాజీ టెలీఫిల్మ్స్‌కు చెందిన ఆల్ట్‌ (అంతక్రితం ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్‌ఎమ్‌, డేటింగ్‌ యాప్‌ క్వాక్‌క్వాక్‌, ట్రూలీ మ్యాడ్లీ వంటివి తొలగింపునకు గురయ్యాయి. నౌకరీ, నౌకరీ రిక్రూటర్‌, నౌకరీగల్ఫ్‌, 99 ఏకర్స్‌, శిక్షా మొబైల్ అప్లికేషన్లను గూగుల్ డీలిస్ట్‌ చేసినట్లు ఇన్ఫోఎడ్జ్‌ (ఇండియా) లిమిటెడ్‌ శనివారం వెల్లడించింది.

  • #update: కేంద్ర ప్రభుత్వం జోక్యంతో గూగుల్‌ ప్లే స్టోర్‌ కొన్ని యాప్స్‌ను పునరుద్ధరించింది. నౌకరీ, 99 ఏకర్స్‌, నౌకరీ గల్ఫ్‌, షాదీ వంటి యాప్స్‌ మళ్లీ ప్లేస్టోర్‌లో దర్శనమిచ్చాయి. మరికొన్ని యాప్స్‌ ఇంకా పునరుద్ధరించాల్సి ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని