Credit card: క్రెడిట్‌ కార్డ్‌ రివార్డు పాయింట్లు పెంచుకోవడమెలా?

Credit card: క్రెడిట్ కార్డ్‌ ద్వారా వచ్చే రివార్డులను ఎక్కువ మొత్తంలో సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి.

Updated : 02 Mar 2024 12:12 IST

Credit card | ఇంటర్నెట్‌డెస్క్‌: క్రెడిట్‌ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ఆఫర్లు, రివార్డులు లభిస్తుండడంతో చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. కిరాణా కొనుగోళ్ల దగ్గర నుంచి రైలు, విమాన టికెట్‌ బుకింగ్‌ల వరకు అన్నింటికీ  క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లింపులు చేస్తూ రివార్డ్‌ పాయింట్లు సంపాదిస్తున్నారు. ఆ పాయింట్లు రీడీమ్‌ చేసి ప్రయోజనాలు పొందుతున్నారు.

సాధారణంగా క్రెడిట్‌ కార్డులో వినియోగం బట్టి రివార్డులు లభిస్తాయి. అలాగని, ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తేనే రివార్డ్‌ పాయింట్లు, గిఫ్ట్‌ వోచర్‌లు వస్తాయనుకోవడం అపోహే అవుతుంది. రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు వస్తున్నాయి కదా అని అవసరాలకు మించి ఖర్చు చేస్తే మొదటికే మోసం వస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అలాకాకుండా మీకున్న బడ్జెట్‌లో ఖర్చు చేయడం ద్వారా కూడా రివార్డ్‌ పాయింట్లు పొందొచ్చు. వాటి కోసం కొన్ని టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. 

ఇలాంటివే ఎంచుకోవాలి

ప్రస్తుతం అన్ని ఆదాయ వర్గాల వారికి సులభంగానే క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తున్నారు. ఇలా ఇస్తున్నారని ఏదిపడితే అది తీసుకోకుండా.. మీ ఖర్చు, జీవనశైలికి అనుగుణంగా ఉండే క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోవడం మంచిది. తరచుగా ప్రయాణిస్తున్నవారయితే ట్రావెల్ రివార్డ్‌లు అందించే కార్డ్‌ను, ఒకవేళ ఫ్యూయల్‌ కోసం అధికంగా ఖర్చు చేసే వారైతే ఆ తరహా కార్డులను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా మీ అవసరాలు తీరుతూనే అధికంగా రివార్డు పాయింట్లు  పొందొచ్చు.

దేనికెన్ని పాయింట్లు..?

మార్కెట్‌లో అనేక రకాల క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కార్డు ఇచ్చే రివార్డు పాయింట్లు ఒక్కోలా ఉంటాయి. వాటిని వినియోగించే ముందు రివార్డ్‌ నిబంధనల్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఎలాంటి లావాదేవీలకు ఏ కార్డు ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుందో ఆ కార్డునే వినియోగించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్‌ బ్యాంక్‌ కో- బ్రాండెడ్‌ కార్డును ఆ ప్లాట్‌ఫామ్‌పైనే వినియోగిస్తే ఎక్కువ రివార్డులు లభిస్తాయి. అదే అమెజాన్‌-ఐసీఐసీఐ కార్డును అమెజాన్‌లో కొనుగోళ్లకు వినియోగిస్తే ఎక్కువ పాయింట్లు సంపాదించొచ్చు. అందుకు భిన్నంగా వాడితే పాయింట్లను కోల్పోతారు. 

మైలురాళ్లూ ముఖ్యమే..

కొత్తగా క్రెడిట్‌ కార్డ్‌ తీసుకొనేవారికి ప్రోత్సాహకంలో భాగంగా కార్డు జారీ సంస్థలు వెల్‌కమ్ ఆఫర్‌లు అందిస్తాయి. వీటిని పొందాలంటే నిర్దిష్ట కాలవ్యవధిలో కొంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు, మూడు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నవారు అలాంటి వాటిపై ఓ కన్నేసి ఉంచాలి. మైలురాయికి చేరువగా ఉన్న క్రెడిట్‌ కార్డును వినియోగించడం ద్వారా ఆ ప్రయోజనాన్ని పొందే వీలుంటుంది.

ఇదీ గుర్తుంచుకోండి..

క్రెడిట్‌ కార్డు ఉంది కదా అని అనవసర ఖర్చులు జోలికి వెళ్లకండి. నిర్ణయించుకున్న బడ్జెట్‌లోనే ఖర్చు చేసేందుకు ప్రయత్నించండి. అందుకు తగ్గట్టుగా క్రెడిట్ కార్డ్‌ వినియోగంపై పరిమితి విధించుకోండి. అధిక మొత్తం వినియోగించేసి తీరా బిల్లు చెల్లించలేకపోతే.. అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. పైగా బిల్లు చెల్లించని మొత్తానికి వడ్డీ కట్టాలి. రివార్డు పాయింట్ల ద్వారా వచ్చే లాభం వడ్డీ రూపంలో కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని