Apple Cars: యాపిల్‌ కార్లు లేనట్లే.. కీలక ప్రాజెక్టును పక్కనపెట్టిన టెక్‌ కంపెనీ

Apple Cars: దాదాపు దశాబ్ద కాలంగా పనిచేస్తున్న అటానమస్‌ కార్ల ప్రాజెక్టును టెక్‌ కంపెనీ యాపిల్‌ పక్కన పెట్టింది.

Published : 28 Feb 2024 13:20 IST

Apple Cars | వాషింగ్టన్‌: అటానమస్‌ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కారు విడుదల ప్రణాళికలను ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ (Apple) పక్కన పెట్టింది. ఈ మేరకు గత దశాబ్దకాలంగా ‘టైటన్‌’ పేరిట పనిచేస్తున్న రహస్య ప్రాజెక్టుకు స్వస్తి పలికింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు మంగళవారం కంపెనీ తెలియజేసింది. ఈ విషయంపై ఇప్పటి వరకు యాపిల్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని యాపిల్‌ ఇతర బాధ్యతల్లోకి బదిలీ చేయనుంది. వీరిలో మెజారిటీ సభ్యులు కృత్రిమ మేధ విభాగానికి పనిచేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్‌ 2014 నుంచి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. కానీ, ఇప్పటి వరకు కారు ఎలా ఉంటుందో  వెల్లడించలేదు. కానీ, సిలికాన్‌ వ్యాలీ రోడ్లపై దాన్ని పరీక్షించినట్లు పలుసార్లు వార్తలు వచ్చాయి. యాపిల్‌ వంటి బడా సంస్థ ఇలాంటి కీలక ప్రాజెక్టును పక్కన పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

100 గంటల బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్‌ వాచ్‌ 2.. ధర, ఫీచర్లివే..!

యాపిల్‌ (Apple) వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఫోన్‌ విక్రయాలు విపణిలో సంతృప్త స్థాయి (Saturation)కి చేరుకున్నాయి. దీంతో కంపెనీ ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ వస్తోంది. అందులో భాగంగా అటానమస్‌ కార్లపైనా ఫోకస్‌ పెట్టింది. కార్ల తయారీలోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు సీఈఓ టిమ్‌ కుక్‌ స్వయంగా ఓ సమావేశంలో సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పరిశోధన కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా టెస్లా కార్లకు పోటీగానే దీన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.

యాపిల్‌ (Apple) వినూత్న ఆవిష్కరణల విషయంలో వెనకబడి పోయిందనే వాదన టెక్‌ వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తోంది. ఐఫోన్‌లలోనూ పెద్దగా మార్పులేమీ ఉండట్లేదనే విమర్శలు వస్తున్నాయి. కుక్‌ సారథ్యంలో కంపెనీ చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఉత్పత్తులను తీసుకురాలేదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో కంపెనీ పరిశోధన, అభివృద్ధిపై 113 బిలియన్‌ డాలర్లు వెచ్చించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని