OnePlus Watch 2: 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో వన్‌ప్లస్‌ వాచ్‌ 2.. ధర, ఫీచర్లివే..!

OnePlus Watch 2: వన్‌ప్లస్‌ వాచ్‌ 2 విడుదలైంది. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో దీన్ని ఆవిష్కరించారు. మార్చి 4 నుంచి భారత్‌లో ఇది విక్రయానికి అందుబాటులోకి రానుంది.

Published : 27 Feb 2024 13:31 IST

OnePlus Watch 2 | ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో వన్‌ప్లస్‌ వాచ్‌ 2 (OnePlus Watch 2) విడుదలైంది. భారత్‌లో మార్చి 4 నుంచి అమెజాన్‌లో ఇది విక్రయానికి అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.24,999. డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.22,999కే లభించనుంది. బ్లాక్‌ స్టీల్‌, రేడియంట్‌ స్టీల్‌ రెండు రంగుల్లో పొందొచ్చు. దీని డయల్‌ పరిమాణం 46 మిల్లీమీటర్లు.

వన్‌ప్లస్‌ వాచ్‌ 2 (OnePlus Watch 2)ను కేవలం ఆండ్రాయిడ్‌ ఫోన్లతో మాత్రమే అనుసంధానం చేయొచ్చు. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ గో-పవర్డ్‌ స్మార్ట్‌ఫోన్లతో ఈ వాచ్‌ను ఉపయోగించలేం. బ్యాటరీ లైఫ్‌ను గణనీయంగా పెంచడం కోసం వన్‌ప్లస్‌ ఈ వాచ్‌లో సరికొత్త వ్యూహాన్ని అనుసరించింది. వేర్‌ఓఎస్‌ కోసం స్నాప్‌డ్రాగన్‌ డబ్ల్యూ5, ఆర్‌టీఓఎస్‌ కోసం బీఈఎస్‌2700 ప్రాసెసర్లను వినియోగించింది. దీంతో స్మార్ట్‌ మోడ్‌లో 100 గంటలు, ఆర్‌టీఓఎస్‌ మోడ్‌లో 48 గంటల వరకు బ్యాటరీలైఫ్‌ ఉంటుంది. పవర్‌ సేవర్‌ మోడ్‌లో 12 రోజుల వరకు ఛార్జింగ్‌ ఉంటుంది.

వన్‌ప్లస్ వాచ్‌ 2లో (OnePlus Watch 2) ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. 10 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 24 గంటలకు సరిపడా బ్యాటరీ లైఫ్‌ లభిస్తుంది. పూర్తిగా ఛార్జ్‌ కావడానికి 60 నిమిషాలు సరిపోతుంది. 466x466p రిజల్యూషన్‌తో కూడిన 1.43 అంగుళాల సర్క్యులర్‌ తెరను పొందుపర్చారు. దీనికి సఫైర్‌ క్రిస్టల్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ చాసిస్‌ను ఇచ్చారు. 100కి పైగా వాచ్‌ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి థర్డ్‌ పార్టీ ఫేస్‌లను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 100 స్పోర్ట్‌ మోడ్‌లు ఉన్నాయి. ఎల్‌5 జీపీఎస్‌, బ్లూటూత్‌, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సెల్యులార్‌ కనెక్టివిటీ సదుపాయం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని