iPhone Update: ఐఫోన్లకు అత్యవసర అప్‌డేట్‌.. పెగాసస్‌ను చొప్పించేందుకు హ్యాకర్ల యత్నం!

iPhone Update: ఐఫోన్‌లోకి ఓ స్పైవేర్‌ను చొప్పించేందుకు హ్యాకర్లు ప్రయత్నించినట్లు గుర్తించారు. వెంటనే ఫోన్‌లో ఉన్న లోపాలను గుర్తించి యాపిల్‌ తమ ఐఫోన్‌ యూజర్ల కోసం సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందించింది.

Published : 08 Sep 2023 11:10 IST

వాషింగ్టన్‌: యాపిల్‌ తమ ఐఫోన్‌ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్‌డేట్‌ల (iPhone security updates)ను విడుదల చేసింది. కొంతమంది హ్యాకర్లు ఫోన్లలోకి స్పైవేర్‌ను చొప్పించేందుకు అవకాశం ఉందని గుర్తించడమే దీనికి కారణం. ఇప్పటి వరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని హ్యాకర్లు ఐఫోన్లలోకి స్పైవేర్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన యాపిల్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ల (iPhone security updates)ను అందించింది.

సిటిజన్‌ ల్యాబ్‌ అనే ఇంటర్నెట్‌ వాచ్‌డాగ్‌ ఐఫోన్‌ సాఫ్ట్‌వేర్‌లోని ఈ లోపాలను గుర్తించింది. వెంటనే యాపిల్‌కు తెలియజేసింది. వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సివిల్‌ సొసైటీ ఉద్యోగి ఫోన్‌లోకి ‘పెగాసస్‌ (Pegasus spyware)’ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌ను చొప్పించేందుకు ప్రయత్నించినట్లు సిటిజన్‌ ల్యాబ్‌ పరిశోధకులు గుర్తించారు. అసలు యూజర్‌ ఏమీ చేయకుండానే ఇది ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయ్యేలా మాల్వేర్‌ను చొప్పించాలని చూసినట్లు తెలిపింది. ఇది యాక్టివేట్‌ అయితే, యూజర్‌కు తెలియకుండానే కెమెరా ఆన్‌ కావడం, వాయిస్‌ రికార్డవ్వడం వంటి కార్యకలాపాలు వాటంతట అవే జరుగుతాయని వివరించింది. భారత్‌లో రాజకీయ నాయకులు, ప్రముఖులపై నిఘా కోసం ప్రభుత్వమే పెగాసస్‌ (Pegasus spyware)ను కొనుగోలు చేసిందని అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.

ఐఫోన్‌లోని ఈ లోపాలను సిటిజన్‌ ల్యాబ్స్‌ ‘జీరో-డే-బగ్స్‌’గా వ్యవహరించింది. అంటే వీటిని సరిదిద్దడానికి యాపిల్‌ వద్ద కనీసం ఒక్కరోజు కూడా లేదని అర్థం. ఎట్టకేలకు యాపిల్‌ ఈ లోపాలను వెంటనే సరిదిద్ది సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించింది. ఒకవేళ మీరు కూడా ఐఫోన్‌ యూజర్లయితే.. వెంటనే అప్‌డేట్‌ చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని