iPhone15 Series: ఐఫోన్‌ 15 వేడెక్కుతోందని ఫిర్యాదులు.. స్పందించిన యాపిల్‌

ఎట్టకేలకు ఐఫోన్ 15 సిరీస్‌లోని సమస్యపై యాపిల్‌ స్పందించింది. కొత్తగా విడుదలైన ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌ వేడెక్కడానికి కారణమైన బగ్‌ను సరిచేస్తామని ప్రకటించింది.

Published : 01 Oct 2023 19:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌ 15 సిరీస్‌ (iPhone 15 Series)లో భాగంగా యాపిల్‌ ( Apple) కంపెనీ సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా నాలుగు కొత్త ఫోన్‌లను విడుదల చేసింది. సెప్టెంబరు 22 నుంచి వాటి అమ్మకాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌లో పరిచయం చేస్తున్న కొత్త ప్రో మోడల్స్‌ను ఇప్పటి వరకు విడుదల చేయలేదని యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook) వెల్లడించారు. అలాగే, టైటానియమ్‌ ఫ్రేమ్‌తో ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో చాలా మంది ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ను కొనేందుకు ఆసక్తి కనబరిచారు. కానీ, ఈ మోడల్స్‌లో ఫోన్‌ హీటింగ్ సమస్య ఉత్పన్నమవుతోందని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గేమ్స్‌ ఆడే సమయంలో, వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నప్పుడు, సినిమాలు వంటివి చూస్తున్నప్పుడు ఫోన్‌ వెనుక భాగం వేడెక్కుతోందని యాపిల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. 

ఈ సమస్యపై యాపిల్ కంపెనీ స్పందించింది. కొత్తగా విడుదల చేసిన ఐఓఎస్‌ 17 ఓఎస్‌లోని బగ్‌ కారణంగానే ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌ వేడెక్కుతున్నాయని యాపిల్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ వార్తా  సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ కొత్తగా విడుదలైన ఐఫోన్ 15 సిరీస్‌లో ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో ఐఓఎస్‌ 17లోని బగ్‌ కారణంగా బ్యాగ్రౌండ్‌ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోంది. దీనివల్ల ఫోన్‌ వేడెక్కుతోంది. దాంతోపాటు థర్డ్‌-పార్టీ యాప్‌ల నుంచి వచ్చే అప్‌డేట్‌లు కూడా ఫోన్ వేడెక్కేందుకు కారణమవుతున్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ఐఓఎస్‌ 17 అప్‌డేట్‌ను విడుదల చేస్తాం’’ అని తెలిపింది. అలాగే, ఫోన్‌ వేడెక్కడానికి, టైటానియమ్‌ ఫ్రేమ్‌ కారణం కాదని తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని