Apple: ఐఫోన్‌ 12 రేడియేషన్‌ గురించి మాట్లాడొద్దు..!

యాపిల్‌ ఐఫోన్‌ 12 రేడియేషన్‌పై ఐరోపా సమాఖ్యలో ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడి దేశాలు ఈ అంశంపై దృష్టిపెట్టాయి.

Published : 15 Sep 2023 13:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఫోన్‌ 12 (iPhone 12) రేడియేషన్‌కు సంబంధించి యాపిల్‌ (Apple) సంస్థపై విమర్శలొస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని టెక్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌ .. ఈ రేడియేషన్‌పై ఎలాంటి సమాచారాన్ని బయటకు వెల్లడించవద్దని యాపిల్‌ ఆదేశించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. ఐరోపా సమాఖ్య నిర్దేశించిన ప్రమాణాల కంటే ఈ ఫోన్‌ అధికంగా ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్‌ను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఐఫోన్‌ 12 విక్రయాలు నిలిపివేయాలని యాపిల్‌ సంస్థను ఫ్రాన్స్‌ ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సిబ్బందికి యాపిల్‌ మార్గదర్శకాలను పంపింది. ఐఫోన్‌12 కొని రెండు వారాలు దాటితే.. వారు రిటర్న్‌, ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడానికి అంగీకరించవద్దని పేర్కొంది. దీంతోపాటు వారి ఫోన్లు పూర్తిగా సురక్షితమైనవని.. కఠిన పరీక్షలను దాటుకొని వచ్చాయని కస్టమర్లకు వెల్లడించాలని పేర్కొంది.

ఐఫోన్‌12 విక్రయాల నిలిపివేతపై ఫ్రాన్స్‌ డిజిటల్‌ మంత్రి మాట్లాడుతూ.. ఆ ఫోన్‌ ఐరోపా సమాఖ్య ప్రమాణాల కంటే అధిక రేడియేషన్‌ వెదజల్లుతోందన్నారు. కాకపోతే అది ప్రమాదకర స్థాయి కాదని పేర్కొన్నారు. ఓ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో దీనిని సరిచేయవచ్చని వెల్లడించారు. తాము యాపిల్‌ ప్రతిస్పందన కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. 

ఫ్రాన్స్‌ బాటలో మరిన్ని దేశాలు..?

ఐఫోన్‌ 12పై తాజాగా బెల్జియం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఫోన్‌ వినియోగంలో ఉన్న రిస్క్‌లపై టెలికామ్‌ నియంత్రణ సంస్థ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆ దేశ జూనియర్ డిజిటల్‌ మినిస్టర్‌ కోరారు. మరో వైపు జర్మనీ కూడా ఈ ఫోన్‌ రేడియేషన్‌ స్థాయిని తనిఖీ చేయనున్నట్లు వెల్లడించింది. డచ్‌ కూడా ఐఫోన్‌12పై యాపిల్‌ను వివరణ కోరింది. 

యాత్రా ఆన్‌లైన్‌ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే

ఫ్రాన్స్‌కు చెందిన రేడియేషన్‌ వాచ్‌ డాగ్‌ ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ (ఏజెన్సీ నేషనల్‌ డెస్‌ ఫ్రీక్వెన్సీస్‌) మొత్తం 141 ఫోన్లపై పరీక్షలు నిర్వహించింది. ఐఫోన్‌ 12ను పట్టుకొన్నా, జేబులో పెట్టుకొన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్‌ రేడియేషన్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈయూ ప్రమాణాల ప్రకారం ఇది ప్రతి కిలోగ్రామ్‌కు 4 వాట్స్‌ ఉండాలి. కానీ, ఐఫోన్‌ 12లో 5.74గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు