Yatra Online IPO: యాత్రా ఆన్‌లైన్‌ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే

Yatra Online IPO full details: రూ.775 కోట్ల సమీకరణ లక్ష్యంతో యాత్రా ఆన్‌లైన్‌ ఐపీఓ శుక్రవారం ప్రారంభమైంది.

Published : 15 Sep 2023 10:32 IST

Yatra Online IPO | ముంబయి: ప్రయాణ సేవలు అందించే యాత్రా ఆన్‌లైన్‌ ఐపీఓ (Yatra Online IPO) శుక్రవారం ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 20 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ఐపీఓలో భాగంగా రూ.602 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు 1.21 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా కంపెనీ జారీ చేయనుంది. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రూ.775 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్ఠంగా 75 శాతం అర్హతగల సంస్థాగత మదుపర్లకు (QIB), 15 శాతం సంస్థాగతయేతర మదుపర్లకు (NII), 10 శాతం షేర్లు రిటైల్‌ మదుపర్లకు కేటాయించారు. ఈ షేర్లు సెప్టెంబరు 29న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ సూచీల్లో లిస్ట్‌ కానున్నాయి. కనీసం 105 (ఒక లాట్‌) షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.14,910 పెట్టుబడిగా పెట్టాలి. రిటైల్‌ మదుపర్లు గరిష్ఠంగా 13 లాట్ల వరకు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. అంటే రూ.1,93,830 వరకు పెట్టుబడి పెట్టేందుకు వీలుంది.

ఈ పబ్లిక్‌ ఇష్యూ (IPO) ద్వారా సమకూరిన మొత్తంలో రూ.150 కోట్లు వ్యూహాత్మక పెట్టుబడులు, కొనుగోళ్లకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. మరో రూ.392 కోట్లు కస్టమర్లను ఆకర్షించడం, వారిని అట్టిపెట్టుకోవడం, సాంకేతికత, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు యాత్రా ఆన్‌లైన్‌ సీఈఓ ధ్రువ్‌ శ్రింఘి వెల్లడించారు. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, ఐఐఎఫ్ఎల్‌ సెక్యూరిటీస్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.198 కోట్ల నుంచి రూ.380 కోట్లకు పెరిగింది. కొవిడ్‌ అనంతరం వినియోగదారుల, కార్పొరేట్‌ ట్రావెల్‌ వ్యాపారం పుంజుకోవడంతో ఆదాయంలో వృద్ధి నమోదైంది. ఇదే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.7.6 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

ఐపీఓ వివరాలు (Yatra Online IPO details)..

  • ఐపీఓ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబరు 15
  • ఐపీఓ ముగింపు తేదీ : 2023 సెప్టెంబరు 20
  • ఒక్కో షేరు ముఖ విలువ : రూ.1
  • ధరల శ్రేణి : రూ.135- 142
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 105 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,910 (గరిష్ఠ ధర వద్ద)
  • షేర్ల కేటాయింపు తేదీ : 2023 సెప్టెంబరు 25
  • రిఫండ్ల ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబరు 26
  • డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ : 2023 సెప్టెంబరు 27
  • లిస్టింగ్‌ తేదీ : 2023 సెప్టెంబరు 29
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని