బజాజ్‌- ట్రయంఫ్‌ నుంచి 2 మోటార్‌ సైకిల్స్‌.. ఆ బైక్స్‌కు గట్టి పోటీ!

బజాజ్‌ -ట్రయంఫ్‌ కలిసి రెండు కొత్త బైక్‌లను దేశీయ విపణిలోకి తీసుకొచ్చాయి. ఇందులో ట్రయంఫ్‌ స్పీడ్‌ ధరను రూ.2.33 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు ఈ బైక్‌ గట్టి పోటీ ఇవ్వనుంది.

Updated : 05 Jul 2023 19:26 IST

పుణె: దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో (Bajaj Auto), బ్రిటీష్‌ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌ (Triumph) కలిసి డెవలప్‌ చేసిన రెండు బైకులు దేశీయ విపణిలోకి అడుగుపెట్టాయి. ట్రయంఫ్‌ స్పీడ్‌ 400 (Triumph Speed 400), స్క్రాంబ్లర్‌ 400 ఎక్స్‌ (Scrambler 400 X) పేరిట వీటిని తీసుకొచ్చాయి. లండన్‌లో గత వారం ఈ రెండు బైకులు విడుదల చేశారు. ట్రయంఫ్‌ స్పీడ్‌ 400 ధర రూ.2.33 లక్షలుగా నిర్ణయించారు. తొలి 10 వేల కస్టమర్లకు రూ.2.23 లక్షలకే విక్రయించనున్నట్లు రెండు కంపెనీలు ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. స్క్రాంబ్లర్‌ 400 ఎక్స్‌ ధరను వెల్లడించలేదు. స్పీడ్‌ 400 ఈ నెల నుంచే విక్రయించనుండగా.. స్క్రాంబ్లర్‌ 400 ఎక్స్‌ విక్రయాలు అక్టోబర్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. 

ఇక ఇంజిన్‌ విషయానికొస్తే.. ఈ రెండు మోటార్‌ సైకిళ్లు 398 సీసీ ఇంజిన్‌తో వస్తున్నాయి. లిక్విడ్‌ కూల్డ్‌, డ్యూయల్‌ ఓవర్‌ హెడ్‌ క్యామ్‌షాఫ్ట్‌ సింగిల్‌ సిలిండర్‌తో వస్తున్న ఈ ఇంజిన్‌.. 40 పీఎస్‌ పవర్‌ను, 39.5 నానోమీటర్‌ పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ అమర్చారు. లీటర్‌కు 28 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ వంటివి ఉన్నాయి. 
Also Read: హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్‌ 440 బైక్‌

చకన్‌ ప్లాంట్‌లో ఈ రెండు మోటార్‌ సైకిళ్లను తయారు చేస్తున్నారు. నెలకు 5 వేల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నామని, డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచనున్నట్లు బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. మెరుగైన అమ్మకాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. రెండు కంపెనీలు 2017లోనే గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ను కుదుర్చకున్నాయి. దేశీయంగా ట్రయంఫ్‌ మోటార్‌ సైకిళ్ల విక్రయాలు, మార్కెట్‌ కార్యకలాపాలు వంటి వ్యవహారాలను బజాజ్‌ ఆటోనే చూస్తోంది. ఇప్పటికే కేటీఎం, చేతక్‌ ఎలక్ట్రిక్స్‌, బజాజ్ ద్విచక్ర, త్రిచక్ర వాహన వ్యాపార కార్యకలాపాలను బజాజ్‌ నిర్వహిస్తోంది.

బజాజ్‌-ట్రయంఫ్‌ తీసుకొచ్చిన కొత్త బైక్స్‌ దేశీయంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. అలాగే, ఇటీవల దేశీయంగా విడుదలైన హార్లేడేవిడ్‌సన్‌ ఎక్స్‌440కి నుంచీ గట్టి పోటీ ఉండనుంది. KTM 390 సిరీస్‌తో బీఎండబ్ల్యూ జీ310, త్వరలో విడుదల కానున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450 సైతం ఈ సెగ్మెంట్‌లో పోటీపడనున్నాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 అమ్మకాలతో దూసుకెళుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని