Bajaj Auto: రెండు నెలల్లో మార్కెట్‌లోకి తొలి CNG బైక్‌: రాజీవ్‌ బజాజ్‌

Bajaj CNG Bike: బజాజ్ ఆటో కంపెనీ మరో రెండు నెలల్లో తొలి సీఎన్‌జీ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

Published : 22 Mar 2024 18:05 IST

పుణె: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో (Bajaj Auto) ద్విచక్ర వాహన విభాగంలో నూతన అంకానికి తెర లేపనుంది. ఈ ఏడాది జూన్‌ నాటికి తొలి సీఎన్‌జీ బైక్‌ (CNG Bike)ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ రాజీవ్‌ బజాజ్ (Rajiv Bajaj) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ‘కార్పొరేట్‌ సామాజిక బాధ్యత’ (CSR) కింద రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. 

‘‘పర్యావరణ పరిరక్షణతోపాటు అధిక మైలేజ్‌ కోరుకునే బైకర్లను దృష్టిలో ఉంచుకుని బజాజ్‌ ఆటో సీఎన్‌జీ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ బైక్‌ను మరో కొత్త బ్రాండ్‌ పేరుతో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. తయారీ వ్యయం ఎక్కువకావడం వల్ల పెట్రోల్‌ బైక్‌లతో పోలిస్తే ధర ఎక్కువగా ఉంటుంది. ఇందులో పెట్రోల్‌, సీఎన్‌జీ రెండు ఆప్షన్లు ఉంటాయి. దీని కోసం బైక్‌ ట్యాంక్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నాం. 20 ఏళ్ల క్రితం విడుదలైన పల్సర్‌ బైక్‌కు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించింది. త్వరలో ఇది 2 మిలియన్‌ యూనిట్ల మైలు రాయిని చేరుకోనుంది. పల్సర్‌ తరహాలోనే బజాజ్‌ సీఎన్‌జీ బైక్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అని రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. 

ఐపీఎల్‌ వేళ జియో కొత్త ప్లాన్‌.. రూ.49తో 25జీబీ డేటా

బజాజ్‌ కంపెనీ సీఎన్‌జీ బైక్‌ తీసుకొస్తుందని ఎంతోకాలంగా ప్రచారం జరుగుతోంది. తొలుత ఈ బైక్‌ను 2025లో తీసుకొస్తారని భావించారు. అంతకుముందే ఈ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయాలని బజాజ్‌ సన్నాహాలు చేస్తోంది. పర్యావరణపరంగా సంప్రదాయ పెట్రోల్‌ వాహనంతో పోలిస్తే సీఎన్‌జీతో 50శాతం మేర ఉద్గారస్థాయిలు తగ్గుతాయని రాజీవ్‌ పేర్కొన్నారు. దేశానికి, సమాజానికి, వినియోగదారుడికి కూడా ఇది సరైన ఎంపికగా కంపెనీ భావిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ఈ సెగ్మెంట్‌లో మరిన్ని వాహనాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని