iPhone: వారెంటీ ఉన్నా తిరస్కారం.. యాపిల్‌ యూజర్‌కు ₹1లక్ష పరిహారం!

iPhone compensation: మొబైల్‌పై వారెంటీ ఉన్నా తన ఐఫోన్‌ను బాగుచేయడాన్ని యాపిల్‌ సంస్థ తిరస్కరించినందుకు ఓ వ్యక్తి వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

Published : 30 Sep 2023 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ లక్ష రుపాయల జరిమానా విధించింది. మొబైల్‌ ఫోన్‌కు ఉన్న వారెంటీ వర్తించినా రిపేర్‌ చేయటాన్ని తిరస్కరించినందుకు సదరు యూజర్‌కు రూ.లక్ష పరిహారం అందించాలని ఆదేశించింది.

వివరాళ్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన వాజ్ ఖాన్  (30) 2021 డిసెంబర్‌లో ఐఫోన్‌ 13 (iPhone 13) కొనుగోలు చేశారు. ఆ ఫోన్‌కు ఏడాది వారెంటీ ఉంది. కొనుగోలు చేసిన కొన్ని నెలలకే ఆ ఫోన్‌ బ్యాటరీ, స్పీకర్‌తో సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ ఫోన్‌ రిపేర్‌కోసం స్థానికంగా ఉన్న ఓ సర్వీస్‌ సెంటర్‌లో (2022 ఆగస్టులో) ఇచ్చారు. ఐఫోన్‌లోని లోపాన్ని సరిచేశామని, ఫోన్‌ తీసుకెళ్లొచ్చని సర్వీస్‌ సెంటర్‌ నుంచి  కాల్‌ వచ్చింది. తీరా ఫోన్ తీసుకొని పరిశీలించగా..  ముందులానే అందులో లోపాలు ఉన్నాయని గమనించిన ఖాన్‌ తిరిగి ఇచ్చారు. దీంతో రెండు వారాల్లో మీ ఐఫోన్‌ బాగు చేస్తామని సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు అయనకు బదులిచ్చారు. అయితే,  రెండు వారాలు గడిచినా ఖాన్‌కు వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

45 గంటల బ్యాటరీ లైఫ్‌తో ₹1699కే నాయిస్‌ కొత్త ఇయర్‌బడ్స్‌.. ఫీచర్లు ఇవే!

ఖాన్‌ కొనుగోలు చేసిన ఐఫోన్‌ 13లో ఔటర్‌ మెష్‌లో జిగురు లాంటి పదార్థం ఉందని, వారెంటీలో భాగంగా దాన్ని బాగు చేయలేమని సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు తీరికగా సమాధానం చెప్పారు. దీన్ని రిపేర్‌ చేయాలంటే అదనంగా డబ్బు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ విషయంపై ఖాన్‌ యాపిల్‌ సంస్థకు అనేక సార్లు ఈమెయిల్స్‌ పంపారు. అయినా ఎటువంటి స్పందనా రాలేదు. చివరకు అదే ఏడాది డిసెంబర్‌లో జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో  ఫిర్యాదు చేశాడు. అతని వాదనలు విన్న కమిషన్‌ పరిహారం అందించాలని యాపిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. రూ.79,900 నష్టపరిహారంతో పాటూ వడ్డీ కింద మరో రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని