USB charger scam: ఆరు బయట ఛార్జర్లు వాడొద్దు.. కేంద్రం సూచన

USB charger scam: బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్స్‌ సాయంతో మొబైల్‌ ఛార్జ్‌ చేయొద్దని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది.

Published : 31 Mar 2024 00:03 IST

USB charger scam | ఇంటర్నెట్‌డెస్క్‌: ఎక్కువ సేపు బయటకు వెళ్తున్నామంటే ఫోన్‌ ఉండాల్సిందే. మొబైల్ బ్యాటరీ అయిపోగానే ఎక్కడ యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్స్‌ కనిపిస్తే అక్కడ ఛార్జింగ్ పెట్టేస్తాం. బస్టాండ్లు, ఎయిర్‌పోర్టులు, హోటళ్లు.. ఇలా తేడా లేకుండా కేబుల్‌ కనిపిస్తే బ్యాటరీ ఫుల్‌ చేసేస్తాం. ఇకపై ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఫోన్‌ ఛార్జింగ్‌ చేయొద్దని  ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్ ఇండియా (CERT-IN) హెచ్చరించింది. లేకపోతే సైబర్‌ దాడులు ఎదుర్కోవాల్సి రావొచ్చని తెలిపింది.

బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన యూఎస్‌బీ ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడం లేదా వారి పరికరాల్లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయడం కోసం ఛార్జింగ్‌ పోర్ట్స్‌ ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం తెలియక చాలామంది బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల్లో కేబుల్స్‌ ఉన్నాయని ఫోన్‌ ఛార్జింగ్‌ చేస్తుంటారు. ఇలా సైబర్‌ వలలో చిక్కుకుంటున్నారు. ఈతరహా దాడులనే జ్యూస్ జాకింగ్ అంటారు. వీటితో జాగ్రత్త వహించాలంటూ CERT-IN సూచించింది.

తిరుమల ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు ఇవే..

సైబర్‌ దాడుల బారిన పడకుండా ఉండాలంటే.. ఇకపై బయటకు వెళ్లినప్పుడు మొబైల్‌కి ఛార్జింగ్‌ పెట్టాలంటే ఒకటికి, రెండుసార్లు ఆలోచించండి. ఎలక్ట్రికల్ వాల్ అవుట్‌లెట్‌ను మాత్రమే ఎంచుకోండి. లేదా కేబుల్స్, పవర్‌ బ్యాంక్‌లను తీసుకెళ్లడం ఉత్తమం. వేరే పరికరాలకు కనెక్ట్‌ చేయొద్దు. ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అయ్యే పరిస్థితుల్లో ఉందనిపిస్తే మాత్రమే ఛార్జింగ్‌ చేయండి. ఒకవేళ సైబర్‌ దాడి జరిగితే www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయొచ్చు. లేదా 1930 హెల్ప్‌లైన్‌ నంబరుకు కాల్‌ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని