Irctc Tirupati: తిరుమల ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు ఇవే..

Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్‌ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్‌సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి..

Published : 30 Mar 2024 12:17 IST

IRCTC | ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో పదోతరగతి ఎగ్జామ్స్‌ కూడా పూర్తవనున్నాయి. సాధారణంగా వేసవి సెలవుల్లో చాలామంది కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తుంటారు. ఇప్పటికే కొందరు టికెట్లు బుక్‌ చేసుకొని ఉంటారు. మరికొందరు టికెట్లు దొరక్క ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి వారికోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) రైలు, విమాన ప్యాకేజీలను అందిస్తోంది. దర్శన టికెట్ల కోసం చింతించకుండా ఎంచక్కా వెంకటేశ్వరుడిని దర్శించుకొనే అవకాశం కల్పిస్తోంది.

తిరుమల వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, స్లీపర్‌) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి. ఏసీ గదిలో బస, రవాణా సదుపాయం ఉంటుంది. ప్యాకేజీని బట్టి టిఫిన్‌, భోజన సదుపాయం ఉంటుంది. ప్రయాణంలో ఏపీటీడీసీ గైడ్ మీకు సహకరిస్తారు. ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది. టోల్, పార్కింగ్ ఛార్జీలు ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది. విమాన ప్రయాణానికి కూడా ప్యాకేజీలో పేర్కొన్న సదుపాయాలే ఉంటాయి. పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం వాటిని భక్తులు చెల్లించాలి. తిరుమల్లో శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌ నుంచి ఉన్న ప్యాకేజీలు

రైలు మార్గం ద్వారా తిరుపతికి చేరుకోవడానికి గోవిందం ‘GOVINDAM’ పేరుతో ఐఆర్‌సీటీసీ ఓ ప్యాకేజీని అందిస్తోంది. రెండు రాత్రులు, మూడు పగళ్లు ప్రయాణం కొనసాగుతుంది. ప్రతి రోజూ ఈ రైలు (ట్రైన్‌ నం.12734) అందుబాటులో ఉంటుంది. గుంటూరు, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ట్రిప్‌ పూర్తయ్యాక ఆయా స్టేషన్లలో దిగే సదుపాయం ఉంటుంది. ఏప్రిల్‌ 5 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.3,800 నుంచి టికెట్ ధరలు ప్రారంభం అవుతాయి. మరింత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

తిరుమలతో పాటు: పూర్వ సంధ్య (POORVA SANDHYA) పేరుతో ఐఆర్‌సీటీసీ మరో టూర్‌  ప్యాకేజీ అందిస్తోంది. తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూరు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ప్రయాణం కొనసాగుతుంది. రోజూ ఈ రైలు (ట్రైన్‌ నం. 12734) అందుబాటులో ఉంటుంది. గుంటూరు, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ఏప్రిల్‌ 5 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ ధరలు రూ.5,660 నుంచి ప్రారంభం అవుతాయి. మరింత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

ఎయిర్‌ ప్యాకేజ్‌ కూడా..

రెండ్రోజుల్లోనే శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యేలా ఐఆర్‌సీటీసీ ‘తిరుపతి బాలాజీ దర్శనం’ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి 6E-2005 విమానంలో ప్రయాణిస్తారు. తిరుమల దర్శనం తర్వాత బస్సు మార్గంలో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు ఆలయాల  దర్శనం ఉంటుంది. ఏప్రిల్‌ 11, 18, 25, 29 తేదీల ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. రూ.15వేల నుంచి టికెట్‌ ధరలు ప్రారంభం అవుతాయి. మరింత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

విజయవాడ నుంచి

విజయ గోవిందం (VIJAY GOVINDAM) పేరుతో రెండు రాత్రులు, నాలుగు పగళ్లు ప్రయాణంతో ఐఆర్‌సీటీసీ శ్రీనివాసుని దర్శన ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఏప్రిల్‌ 12 నుంచి ప్రతీ శుక్రవారం శేషాద్రి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్‌ నం- 17210) రైలు అందుబాటులో ఉంటుంది. విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, సామర్లకోట, తెనాలి స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు. రూ.3,800 నుంచి టికెట్‌ ధరలు ప్రారంభం. మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను పరిశీలించండి.

ఏడుకొండల స్వామిని దర్శించుకొనేందుకు సప్తగిరి (SAPTHAGIRI) పేరుతో విజయవాడ నుంచి మరో ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఏప్రిల్‌ 11 నుంచి ప్రతీ మంగళవారం (ట్రైన్‌ నెం: 12762) రైలు అందుబాటులో ఉంటుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు యాత్ర సాగుతుంది. రూ.5,600 నుంచి టికెట్‌ ధరలు ఉంటాయి. విజయవాడతో పాటు జమ్మికుంట, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది. కాబట్టి ఆయా ప్రాంత వాసులు ఈ ప్యాకేజీ వినియోగించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

గమనిక: అందుబాటులో ఉన్న ప్యాకేజీ వివరాలను తెలియజేశాం. మీ ప్రయాణ తేదీలకు అనుగుణంగా టికెట్లు లభ్యతను ప్రయాణికులే చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని