Biden: చైనా స్మార్ట్‌ కార్లతో జాగ్రత్త : బైడెన్‌ సర్కార్‌

Biden: చైనా తయారుచేసిన కార్లపై దర్యాప్తు చేపట్టాలని బైడెన్‌ ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Published : 29 Feb 2024 23:10 IST

వాషింగ్టన్‌: చైనా కార్లపై బైడెన్‌ (Biden) సర్కార్‌ దర్యాప్తునకు ఆదేశించింది. కార్ల సాయంతో అమెరికన్ల  వ్యక్తిగత సమాచారాన్ని డ్రాగన్‌ సేకరించే ప్రమాదం ఉందని బైడెన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఎలక్ట్రిక్‌ సహా ఇతర కార్లలోని డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ వంటి ఫీచర్లను ఉపయోగించి అమెరికన్లపై గూఢచర్యం చేసేందుకు అవకాశం ఉందని భావిస్తోంది. ఈ క్రమంలో అమెరికన్ల డేటాను రక్షించడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బైడెన్‌ గురువారం ప్రకటించారు.

‘అన్యాయమైన పద్ధతుల ద్వారా భవిష్యత్తులో ఆటో మొబైల్‌ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించాలని చైనా నిశ్చయించుకుంది. చైనా అవలంభిస్తున్న విధానాలతో మొత్తం మార్కెట్‌ను వాటి వాహనాలతో నింపగలవు. అవి మన భద్రతకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. నా పాలనలో అలా జరగనివ్వను’ అని బైడెన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికన్ల డేటా దుర్వినియోగం కాకుండా సంబంధిత సాంకేతికతను చైనా వినియోగించడంపై ఆంక్షలు విధించడానికి ఈ దర్యాప్తు దారితీయొచ్చని భావిస్తున్నారు.

నా బలం, బలగం వాళ్లే..!: ఆకాశ్‌, ఈశా గురించి అనంత్‌ అంబానీ

ఈ వ్యవహారంపై వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో మాట్లాడుతూ.. ఇంటర్నెట్‌కు అనసంధానించిన కార్లు.. చక్రాలపై ఉన్న స్మార్ట్ ఫోన్‌ల వంటివన్నారు. ‘చైనా స్మార్ట్‌ కార్లు ఇంటర్నెట్‌కు అనుసంధానించి ఉన్నాయి. డ్రైవర్ల ద్వారా వ్యక్తిగత సమాచారం, బయోమెట్రిక్‌ వంటి సున్నితమైన డేటాను సేకరిస్తాయి. ఇది జాతీయభద్రతకు, పౌరుల గోప్యతకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది’ అని ఆమె అన్నారు. చైనా వాహనాలపై ట్రంప్‌ విధించిన అధిక సుంకాల విధానాన్ని బైడెన్‌ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇది చైనా వాహన దిగుమతుల్ని కొంతవరకు నిరోధించింది. అయినప్పటికీ చైనా కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని