Brookfield-ATC deal: బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి అమెరికన్‌ టవర్స్‌ భారత వ్యాపారం

Brookfield-ATC deal | భారతదేశంలో తమ టెలికాం టవర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలనుకుంటున్నామని బ్రూక్‌ఫీల్డ్‌ తెలిపింది. అందులో భాగంగానే కొనుగోళ్లు చేపడుతున్నట్లు వెల్లడించింది.

Updated : 05 Jan 2024 12:18 IST

దిల్లీ: భారత టెలికాం రంగంలో మరో భారీ ఒప్పందం ఖరారైంది. ‘అమెరికన్‌ టవర్‌ కార్పొరేషన్‌ (ATC)’ భారత వ్యాపారాన్ని కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ (Brookfield) సొంతం చేసుకోనుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రెండు బిలియన్‌ డాలర్లని (దాదాపు రూ.16,500 కోట్లు) పేర్కొంటూ శుక్రవారం ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. దీనికి నియంత్రణాపరమైన అనుమతులు రావాల్సి ఉంది.

ఏటీసీ ఇండియా (ATC India) పోర్ట్‌ఫోలియోలో దేశవ్యాప్తంగా 78 వేల సైట్లు ఉన్నాయి. భారత టెలికాం రంగంలో బ్రూక్‌ఫీల్డ్‌కు ఇది మూడో కొనుగోలు. 2022లో ఈ కంపెనీ దేశంలో 5,000 ఇండోర్‌ బిజినెస్‌ సొల్యూషన్‌ సైట్లు, స్మాల్‌ సెల్ సైట్లను సొంతం చేసుకుంది. తద్వారా టెలికాం ఆపరేటర్లు 5జీ నెట్‌వర్క్‌ను మారుమూల ప్రాంతాలకూ విస్తరించేందుకు తోడ్పాటునందించింది. 2020లో ‘రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌’ నుంచి 1,75,000 టవర్లను కొనుగోలు చేసింది.

‘‘భారతదేశంలో మా టెలికాం టవర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలనుకుంటున్నాం. తద్వారా మా కస్టమర్లు, భాగస్వాముల కోసం విస్తృత శ్రేణి పరిష్కారాలను అందిస్తాం. ATC ఇండియా వంటి వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా డిజిటల్ కనెక్టివిటీని విస్తృతం చేస్తాం. టెలికాం మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి కట్టుబడి ఉన్నాం’’ అని బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా ఎండీ అర్పిత్‌ అగర్వాల్‌ అన్నారు. భారత్‌లో ఈ కంపెనీ నిర్వహణలో 25 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. మౌలిక, స్థిరాస్తి, పునరుత్పాదక ఇంధనం, ప్రైవేట్‌ ఈక్విటీ రంగాల్లో ఇవి విస్తరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని