Byjus: వ్యవస్థాపకులకు వ్యతిరేకంగా NCLTలో బైజూస్‌ ఇన్వెస్టర్ల దావా

Byjus: బైజూస్‌ సీఈఓ పదవి నుంచి రవీంద్రన్‌ను తొలగించాలని యోచిస్తున్న ఇన్వెస్టర్లు.. తాజాగా ఇదే విషయంపై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు.

Published : 23 Feb 2024 15:11 IST

దిల్లీ: ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ (Byjus)కు రోజుకో చిక్కొచ్చి పడుతోంది. సీఈఓ రవీంద్రన్‌ (Byju Raveendran) తొలగింపును ప్రతిపాదిస్తూ ప్రత్యేక అసాధారణ సమావేశానికి సిద్ధమైన ఇన్వెస్టర్లు ఆ దిశగా మరో ముందడుగు వేశారు. కంపెనీలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్‌సీఎల్‌టీ (NCLT) బెంగళూరు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. యాజమాన్యంపై ‘అణచివేత, దుర్వినియోగ దావా’ దాఖలు చేశారు. కంపెనీని నడిపించేందుకు సీఈఓ రవీంద్రన్‌ సహా ఇతర వ్యవస్థాపకులను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కొత్త బోర్డు ఏర్పాటుకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవలే ముగిసిన రైట్స్‌ ఇష్యూను సైతం రద్దు చేయాలని ఇన్వెస్టర్లు (Byjus Investors) ఎన్‌సీఎల్‌టీని కోరారు. కంపెనీపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సైతం ఆదేశించాలని విన్నవించారు. ఇన్వెస్టర్ల హక్కులకు భంగం కలిగించే ఎలాంటి కార్పొరేట్‌ చర్యలను కంపెనీ యాజమాన్యం తీసుకోకుండా నిలువరించాలని కోరారు. దావా వేసిన ఇన్వెస్టర్లలో ప్రోసస్‌, జనరల్‌ అట్లాంటిక్‌, సోఫినా, పీక్‌ ఎక్స్‌వీ ఉన్నాయి. వీరికి టైగర్‌, ఓల్ వెంచర్స్‌ వంటి వాటాదారుల మద్దతూ లభించింది. కంపెనీలో షేర్‌హోల్డర్ల వాటాల విలువ కరిగిపోకుండా చూడటంతో పాటు ఉద్యోగులు, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

నేడు తేలనున్న బైజూస్‌ సీఈఓ రవీంద్రన్ భవితవ్యం!

వ్యవస్థాపకుల ఆర్థిక అవకతవకల వల్ల కంపెనీ అనుబంధ విభాగాలైన ఆకాశ్‌పై నియంత్రణ కోల్పోతున్నామని ఇన్వెస్టర్లు దావాలో ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ‘బైజూస్‌ ఆల్ఫా’ దివాలా దశకు చేరుకుందని తెలిపారు. దీర్ఘకాలంగా కార్పొరేట్‌ పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. స్వతంత్ర డైరెక్టర్‌ సహా సీఎఫ్‌ఓ నియామకం నిలిచిపోయాయని గుర్తు చేశారు. స్టేక్‌హోల్డర్లకు సమాచారం అందించడం లేదని తెలిపారు. రైట్స్‌ ఇష్యూ విషయంలో నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. సింగపూర్‌కు చెందిన నార్త్‌వెస్ట్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ కొనుగోలు విషయంలో అనధికారిక కార్పొరేట్‌ చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. బీసీసీఐ, టీఎల్‌బీ వంటి రుణదాతలు, సర్ఫర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ దాఖలు చేసిన దివాలా పిటిషన్లు, బహిర్గతం చేయని నిబంధనలపై ఇంటర్-కార్పొరేట్‌ రుణాలు వంటి అంశాలను సైతం దావాలో ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని