Byjus lay offs: బైజూస్‌లో 500 మందికి ఉద్వాసన.. ఫోన్‌లోనే సమాచారం!

బైజూస్‌ సంస్థ మరోసారి ఉద్యోగ కోతలు చేపట్టింది. దాదాపు 500 మందిని ఇంటికి సాగనంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులకు ఫోన్‌లోనే తొలగింపు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Published : 02 Apr 2024 19:14 IST

Byjus layoffs | దిల్లీ: ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ (Byjus).. మరికొంతమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. గత రెండేళ్లలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ.. తాజాగా మరో 500 మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగం కోల్పోయిన వారిలో సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. అలాగే, బైజూస్‌ ట్యూషన్‌ సెంటర్‌ కార్యకలాపాల్లో ఉన్న ఉద్యోగులూ తాజా తొలగింపులకు గురైన జాబితాలో ఉన్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.

గత 8 వారాలుగా పనితీరు సరిగా కనబరచని ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలగింపునకు సంబంధించిన సమాచారం ఫోన్‌లోనే ఉద్యోగులకు తెలియజేసినట్లు సమాచారం. ఇదే చివరి పని దినమని, తక్షణమే విధుల నుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫోన్‌లో తెలియజేసినట్లు కొందరు ఉద్యోగులు ఆంగ్ల మీడియాకు తెలియజేశారు. నోటీసు పీరియడ్‌ ప్రస్తావన గానీ, పనితీరు మెరుగుపరుచుకునే అవకాశం గానీ ఇవ్వలేదని ఉద్యోగులు వాపోతున్నారు.

30 ఏళ్ల క్రితం ఎస్‌బీఐలో తాతకు షేర్లు.. ఇప్పటి విలువ చూసి మనవడు షాక్‌!

సంస్థ కార్యకలాపాలను సులభతరం చేయడం, ఖర్చులను తగ్గించేందుకు గానూ కంపెనీ గతేడాది అక్టోబర్‌లో వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టింది. తొలగింపుల వేళ.. ఈ ప్రక్రియ తుది దశకు చేరిందని కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఎంతమందిని లేఆఫ్‌ల్లో భాగంగా తొలగించిందీ వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. రైట్స్ ఇష్యూ ద్వారా సమకూరిన నిధుల వినియోగంపై ఆంక్షలు కొనసాగుతున్నందున జీతాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి నెలకొందంటూ ఆ సంస్థ సోమవారం ఉద్యోగులకు సమాచారం ఇచ్చిన మరుసటిరోజే ఉద్యోగులను తొలగించడం గమనార్హం.

కరోనా సమయంలో ఆన్‌లైన్ చదువులకు పెరిగిన డిమాండ్‌తో.. భవిష్యత్‌ను తప్పుగా అంచనా వేసి చేతులు కాల్చుకుంది బైజూస్‌. స్కూళ్లు యథావిధిగా తెరుచుకోవడంతో ఈ సంస్థకు 2022లోనే కష్టాలు మొదలయ్యాయి. దీనినుంచి బయటపడేందుకు సంస్థ లేఆఫ్‌ల మార్గాన్ని ఎంచుకుంది. మరోవైపు ఇన్వెస్టర్లతో పేచీల మూలంగా ఇటీవల రైట్స్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తాలనూ వినియోగించలేక ఇబ్బందిపడుతోంది. దీంతో ఫిబ్రవరి నెల వేతనాలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించలేని స్థితికి చేరుకుంది. తొలగించిన ఉద్యోగులకు బకాయి పడిన వేతనాలను ఏప్రిల్‌ 5 నాటికి జమ చేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. 90 రోజుల్లో ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ ఉంటుందని చెప్పడం కంపెనీ పరిస్థితికి అద్దం పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని