SBI shares: 30 ఏళ్ల క్రితం ఎస్‌బీఐలో తాతకు షేర్లు.. ఇప్పటి విలువ చూసి మనవడు షాక్‌!

30 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఎస్‌బీఐ షేర్లలో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు ఆయన మనవడు తాజాగా కనుగొన్నాడు. వాటి ఇప్పటి విలువ చూసి షాకయ్యాడు.

Updated : 02 Apr 2024 15:43 IST

SBI shares | ఇంటర్నెట్‌ డెస్క్‌: పొదుపు విషయంలో మనకంటే మన పూర్వీకులే ముందు వరుసలో ఉంటారు. పెద్దగా పెట్టుబడి సాధనాలు అందుబాటులో లేని రోజుల్లో భావితరాల కోసం ఆస్తులు కూడబెట్టేవారు. అలాంటిది స్టాక్‌ మార్కెట్‌ గురించి పెద్దగా అవగాహన లేని 30 ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి ఎంతో ముందుచూపుతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) షేర్లను కొని, వాటిని అలానే వదిలేశారు. అప్పట్లో రూ.500 పెట్టి కొన్న వాటాల నేటి విలువ చూసి ఆశ్చర్యపోవడం ఆయన మనవడి వంతైంది.

చండీగఢ్‌కు చెందిన డాక్టర్‌ తన్మయ్‌ మోతీవాలా చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్నారు. ఆయన తాత 1994లో రూ.500 విలువైన ఎస్‌బీఐ షేర్లను కొనుగోలు చేశారు. ఇటీవల కుటుంబ ఆస్తులను ఒకచోట చేర్చినప్పుడు దీనికి సంబంధించిన షేర్ల సర్టిఫికెట్‌ను కనుగొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఈ షేర్లను తన తాత విక్రయించకుండా అలానే వదిలేశారని, వాటి గురించి మరిచిపోయారని పేర్కొన్నారు. ఆ వాటాల విలువ ఇప్పుడు డివిడెండ్లు ఏవీ కలపకుండానే రూ.3.75 లక్షలు అయ్యిందని మోతీవాలా తెలిపారు. ఇప్పుడు ఆ మొత్తం ఎక్కువ కానప్పటికీ.. 30 ఏళ్లలో 750 రెట్లు రిటర్నులు ఇవ్వడమంటే సాధారణ విషయం కాదని తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. 

ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..!

ఈ స్టాక్స్‌ను డీమ్యాట్‌ అకౌంట్లోకి మార్చడానికి పేరు, చిరునామాలో పొరపాట్లు ఉన్నాయని, అందుకోసమే ఓ కన్సల్టెంట్‌ను సంప్రదించానని మోతీవాలా తెలిపారు. ఇది కాస్త క్లిష్టమైన వ్యవహారమని, అందుకు కొంత సమయం కూడా పడుతుందన్నారు. ఈ వాటాలను విక్రయించాలని తాను అనుకోవడం లేదన్నారు. ఈ వైద్యుడి పోస్ట్‌ వైరల్‌గా మారడంతో కొందరు నెటిజన్లు స్పందించారు. ‘మన పెద్దవాళ్లను చూసి నేర్చుకోవాలి’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ మరో యూజర్ కామెంట్‌ పెట్టారు. ఎస్‌బీఐ ఉద్యోగి అయిన తన తండ్రి అప్పట్లో 500 షేర్లను కొనుగోలు చేశారని, ఆయన మరణానంతరం తాను ఆ షేర్లను విక్రయించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఈక్విటీల్లో మదుపు చేయడం ప్రారంభించాననని పేర్కొన్నాడు.

రూ.500 కాదు.. రూ.5వేలు!

డా.తన్మయ్‌ ట్వీట్‌ వైరల్‌గా మారడంతో కొందరు అదెలా సాధ్యమంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు. దీంతో తన్మయ్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి తన తాత షేర్లు కొన్నది 5 వేల రూపాయలకు అని, ముఖ విలువ ఆధారంగా రూ.500గా లెక్కించి తాను పొరబడినట్లు పేర్కొన్నారు. అలాగే, స్టాక్‌ స్ప్లిట్‌ కారణంగా షేర్ల సంఖ్య 500 అయ్యాయని, కాబట్టి వాటి మొత్తంలో ఎలాంటి తేడా లేదని తెలిపారు. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో పెట్టుబడుల వల్ల ప్రయోజనం గురించి చెప్పడమే తన ఉద్దేశమని తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు