BSNLకు రూ.89 వేల కోట్ల భారీ ప్యాకేజీ.. కేబినెట్‌ ఆమోదం

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం మరో పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. దీంట్లో భాగంగా 4జీ, 5జీ స్పెక్ట్రమ్‌ల కేటాయింపులకు మూలధనం కేటాయించాల్సి ఉంది.

Published : 07 Jun 2023 17:27 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ‘భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL)’ సేవల మెరుగు కోసం రూ.89,047 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నిధులను 4జీ, 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులకు కావాల్సిన మూలధనం, మారుమూల ప్రాంతాలకు 4జీ నెట్‌వర్క్‌ విస్తరణ, వేగవంతమైన ఇంటర్నెట్‌ కోసం ‘ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సెస్‌’ సేవలను మెరుగుపర్చడం వంటి పనులకు వినియోగించనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) అధీకృత మూలధనం ఇప్పుడు రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు పెరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా ప్యాకేజీతో మారుమూల ప్రాంతాలకు సైతం కనెక్టివిటీ మెరుగుపడి బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) స్థిరమైన ‘టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌’గా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ అమలు నిమిత్తం టీసీఎస్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇతర టెలికాం సంస్థలు 5జీని విస్తరిస్తున్న సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) 4జీ విస్తరణ దిశగా ఇప్పుడిప్పుడే వేగంగా అడుగులు వేస్తుండడం గమనార్హం. 2019లో బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు కలిపి రూ.69,000 కోట్లతో తొలి పునరుద్ధరణ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. 2022లో మరో రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని అందజేసింది. ప్రభుత్వ వివరాల ప్రకారం.. ఈ రెండు ప్యాకేజీల వల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) 2021-22 నుంచి ఆపరేటింగ్‌ లాభాలను నమోదు చేస్తోంది. మరోవైపు సంస్థ అప్పులు రూ.32,944 కోట్ల నుంచి రూ.22,289 కోట్లకు తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని