Budget 2024: వికసిత భారత్‌ కోసం ‘జ్ఞాన్‌’.. బడ్జెట్‌లో ‘నాలుగు వర్గాల’ సాధికారతే లక్ష్యంగా..

Budget 2024: నాలుగు వర్గాలను మూల స్తంభాలుగా పేర్కొంటూ.. వికసిత్ భారత్‌ లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Published : 01 Feb 2024 20:16 IST

దిల్లీ: దేశంలో ఉన్నది నాలుగు వర్గాలు.. పేదలు, రైతులు, యువత, మహిళలు (Garibi, Youth, Annadata, Narishakthi - GYAN) అని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నేడు (గురువారం) ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కూడా ఈ నాలుగు వర్గాలను వికసిత భారత్‌ మూల స్తంభాలుగా ప్రకటించింది. ఈ తాత్కాలిక పద్దు ‘జ్ఞాన్‌’ సాధికారతపై ప్రధానంగా దృష్టి సారించింది. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్‌గా మార్చడమే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) వెల్లడించారు. ఆ దిశగా బడ్జెట్‌లో తీసుకున్న చర్యలు ఇవి.

మహిళలు

నారీమణులను లక్షాధికారుల్ని చేసే ‘Lakhpati Didis’ పథకాన్ని మూడు కోట్ల మందికి విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ‘‘83 లక్షల స్వయం సహాయక బృందాల్లోని 9 కోట్ల మంది మహిళలు గ్రామీణ ప్రాంతాల సామాజిక భౌతిక స్థితిగతులను మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ బృందాల సహకారంతో ఇప్పటికే  కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు’’ అని నిర్మలమ్మ తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం స్త్రీల కోసం ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాల గురించి వెల్లడించారు. ‘‘గత పదేళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28 శాతం పెరిగింది. స్టెమ్‌ కోర్సుల్లో యువతులు, మహిళల నమోదు 43 శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. ట్రిపుల్‌ తలాక్‌ను చట్టవిరుద్ధంగా మార్చగలిగాం. పీఎం ఆవాస్‌ యోజన పథకం మహిళల గౌరవాన్ని పెంచింది. ఆయుష్మాన్ భారత్‌ కింద ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధి పొందనున్నారు. 9 - 14 ఏళ్ల బాలికలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండేలా వ్యాక్సినేషన్‌పై దృష్టి సారిస్తాం’’ అని ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. గత బడ్జెట్‌లో ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (Mahila Samman Saving Certificate Scheme) పేరుతో  రెండేళ్ల పాటు అందుబాటులో ఉన్న పథకాన్ని ప్రకటించారు. దీని కింద గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.

యువత..

‘స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ అందించాం. తాత్కాలిక, దీర్ఘకాలిక కార్యక్రమాల కింద యువతకు సరికొత్త, అదనపు నైపుణ్యాలు అందించడంపై ఈ మిషన్ దృష్టిసారించింది. కేంద్రంలోని 20కి పైగా మంత్రిత్వ శాఖలు/ విభాగాలు దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నాయి’ అని సీతారామన్‌ తెలియజేశారు. దేశ శ్రేయస్సు.. యువత సాధికారతపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించిన ఆమె.. యువతను ఉద్దేశించి ‘అమృత్‌ ప్రీథి’ అనే పదాన్ని ఉపయోగించారు. 2020లో తీసుకువచ్చిన నూతన విద్యావిధానం గణనీయమైన సంస్కరణలు తీసుకువస్తుందన్నారు.

రైతులు..

పీఎం కిసాన్‌ సమ్మాన్ యోజన కింద ప్రతి సంవత్సరం 11.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. పీఎం ఫసల్‌ బీమా యోజన కింద నాలుగు కోట్ల మంది రైతులకు పంట బీమా కల్పించారు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరిందని, 10 లక్షల మందికి ఉపాధి లభించిందని సీతారామన్‌ అన్నారు. ‘మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ యోజన’ ద్వారా 2.4 లక్షల స్వయం సహాయక బృందాలు, వ్యక్తిగతంగా మరో 60 వేల మందికి రుణసాయం అందించినట్లు చెప్పారు. వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖకు రూ.1.27 లక్షల కోట్లు; మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7,105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. నానో డీఏపీ విస్తరణ, నూనె గింజల్లో స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

వ్యవ‘సాయం’ @ రూ.1.27 లక్షల కోట్లు.. నానో డీఏపీ విస్తరణ.. సమీకృత ఆక్వా పార్క్‌లు

పేదలు...

బస్తీలు, అద్దె ఇళ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నిజం చేసేందుకు పీఎం ఆవాస్‌ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే గత తొమ్మిదేళ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొద్ది రోజుల క్రితం నీతిఆయోగ్‌ నివేదిక ఇచ్చింది. ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం వల్లే ఇది సాధ్యమైందని ఈ విషయాన్ని బడ్జెట్‌లో సీతారామన్ ప్రస్తావించారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల విషయంలో డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ (ప్రత్యక్ష బదిలీ) ద్వారా పొందుతున్న లాభాల గురించి వెల్లడించారు. వీధి వ్యాపారులు, ఆదివాసీలు, చేతివృత్తి కళాకారులను ఉద్దేశించిన పీఎం స్వనిధి స్కీమ్, పీఎం జన్మన్‌ యోజన, పీఎం విశ్వకర్మ యోజన గురించి పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని