Tesla: అమ్మకాల్లో టెస్లాను దాటేసిన బీవైడీ..!

Eenadu icon
By Business News Team Published : 25 Mar 2025 14:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Tesla ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ (BYD) నుంచి అమెరికాకు చెందిన టెస్లా (Tesla)కు తీవ్రమైన పోటీ వస్తోంది. తాజాగా వార్షిక ఆదాయాల్లో మస్క్‌ నేతృత్వంలోని సంస్థను మించింది. షెంజెన్‌ కేంద్రంగా పనిచేసే బీవైడీ గతేడాది 107 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని సంపాదించినట్లు పేర్కొంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 29శాతం అధికం. ఇక ఇదేకాలంలో టెస్లాకు వచ్చిన ఆదాయం 97.7 బిలియన్‌ డాలర్లే కావడం గమనార్హం. బీవైడీ విక్రయాల్లో హైబ్రీడ్‌ వాహనాల జోరు కొనసాగుతోంది. 

బీవైడీ గతేడాది టెస్లా విక్రయించిన విద్యుత్తు వాహనాల సంఖ్యకు (17.9 లక్షల) దాదాపు సమానంగా 17.6 లక్షల వాహనాలను అమ్మింది. కానీ, దీనిలో హైబ్రీడ్‌ వాహనాల విభాగంలో మాత్రం భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఈసారి ఆ కంపెనీ ఏకంగా 43 లక్షల వాహనాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్విన్‌ ఎల్‌గా పిలిచే ఈ కారు ధర టెస్లా మోడల్‌ 3లో దాదాపు సగమే ఉంది. 

ఇటీవలే ఈ చైనా సంస్థ టెస్లా మోడల్‌ 3కి పోటీగా ఓ చౌక మోడల్‌ కారును తీసుకొచ్చింది. చైనా ఈవీ మార్కెట్లో దూసుకెళ్లేందుకు వీలుగా దీనిని తీసుకువచ్చినట్లు సమాచారం. 

దీంతోపాటు బీవైడీ ఈ ఏడాది సరికొత్తగా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీలను ముందుకుతీసుకొచ్చింది. కేవలం ఐదు నిమిషాలు ఛార్జింగ్‌ చేస్తే.. 400 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు. అదే సమయంలో టెస్లాలో 15 నిమిషాలు ఛార్జింగ్‌ పెట్టాల్సిరావచ్చు. ఇక బీవైడీ బేసిక్‌ మోడల్స్‌లో కూడా ఉచితంగా సరికొత్త డ్రైవర్‌ అసిస్టెన్స్‌ను సిద్ధం చేసింది. దీనికి ‘గాడ్స్‌ ఐ’ అని పేరు పెట్టింది.  

గత కొంతకాలంగా టెస్లా సారథి మస్క్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు నెరపడంతో కూడా ఈ కంపెనీ కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోవైపు చైనా తయారీ కార్లపై పశ్చిమదేశాల్లో భారీగా పన్నులు విధిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు