Google: ప్లేస్టోర్‌ ఛార్జీలు.. 10 ప్రముఖ భారత కంపెనీలకు గూగుల్‌ వార్నింగ్‌

Google: కొన్ని కంపెనీలు నిబంధనలకు అనుగణంగా తమకు ప్లే స్టోర్‌ ఛార్జీలు చెల్లించడం లేదని గూగుల్ ఆరోపించింది. వాటిని తొలగిస్తామని హెచ్చరించింది.

Updated : 01 Mar 2024 14:52 IST

దిల్లీ: సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ (Google), భారత్‌లోని యాప్‌ డెవలపర్ల మధ్య కొంతకాలంగా ప్లే స్టోర్‌ (Play Store) ఛార్జీల వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గూగుల్‌ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. కొన్ని కంపెనీలు సర్వీసు ఛార్జీలు చెల్లించకుండా తమ బిల్లింగ్‌ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. అలాంటి వాటిపై విధానపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తమ ప్లే స్టోర్‌ నుంచి వాటిని తొలగిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

‘‘భారత్‌లో 2 లక్షలకు పైగా డెవలపర్లు మా ‘గూగుల్‌ ప్లే’ను వినియోగిస్తున్నారు. వీరంతా మా పాలసీలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. 10 కంపెనీలు మాత్రం కొంతకాలంగా గూగుల్ ప్లేలో మేం అందిస్తున్న సర్వీసులకు ఛార్జీలు చెల్లించడం లేదు. ఇందులో ప్రముఖ స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. కోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందుతూ ఈ కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి’’ అని గూగుల్ ఆరోపించింది.

‘సూర్యఘర్‌’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?

‘‘స్థానిక చట్టాలను మేం గౌరవిస్తాం. గూగుల్‌ ప్లేలో మేం అందించే సేవలకు ఛార్జీలు వసూలు చేయడం మా హక్కు. దాన్ని ఇన్నేళ్లలో ఏ కోర్టూ, రెగ్యులేటర్‌ తిరస్కరించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ 10 కంపెనీలు మాత్రం సర్వీసు ఛార్జీలను చెల్లించడం లేదు. మిగతా ప్లే స్టోర్లకు మాత్రం యథావిధిగా ఛార్జీలు కడుతున్నాయి. మా పాలసీ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వాటి యాప్‌లను స్టోర్‌ నుంచి తొలగిస్తాం’’ అని గూగుల్‌ హెచ్చరించింది. అయితే, ఆ కంపెనీల పేర్లను మాత్రం వెల్లడించలేదు.

దేశంలో గూగుల్‌కు పోటీగా ‘ఇండస్‌ యాప్‌స్టోర్‌’ను ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్‌ పేమెంట్‌ సంస్థ ఫోన్‌పే (Phonepe) దీన్ని రూపొందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని