Solar rooftop: ‘సూర్యఘర్‌’కు దరఖాస్తు ఎలా? ₹78 వేల రాయితీ ఎలా పొందాలి?

PM Surya Ghar Muft Bijli Yojana: ఇంటిపై సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇచ్చే పథకానికి కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి  ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సబ్సిడీ ఎలా పొందాలి?

Published : 01 Mar 2024 13:40 IST

PM Surya Ghar Muft Bijli Yojana | ఇంటర్నెట్ డెస్క్‌: ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు నడిచే ఈ పథకానికి రూ.75,021 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఈ పథకం కింద రాయితీ ఎంత? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

పీఎం సూర్యఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకం (PM Surya Ghar Muft Bijli Yojana) కింద రాయితీని రెండు భాగాలుగా విభజించి కేంద్రం ఇవ్వనుంది. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. మూడు కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేలు అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రెపోరేట్‌కు అదనంగా 0.5% వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది 7% ఉంది.

కరెంట్‌ అమ్ముకోవచ్చు..

ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్‌ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్‌ మీటరింగ్‌ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు రూ.1,265 ఆదాయం వస్తుంది. అందులో రూ.610ని బ్యాంకు రుణవాయిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల ఏడేళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. 1 కిలోవాట్‌కు రూ.30వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నవారికి రూ.60 వేలు, 3 కిలోవాట్ల ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్నవారికి రూ.78వేలు గరిష్ఠ రాయితీ అందుతుందని చెప్పారు. 

పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి?

ఎవరికి ఎంత కెపాసిటీ

నెలకు 0-150 యూనిట్ల విద్యుత్‌ వినియోగించే వారికి 1-2 కిలోవాట్ల రూఫ్‌టాప్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూర్యఘర్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 150-300 యూనిట్లు చొప్పున వినియోగించే వారు 2-3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 300 యూనిట్లకు పైబడి విద్యుత్‌ను వినియోగించే వారు 3 కిలోవాట్‌, ఆ పైబడి సామర్థ్యం కలిగిన సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. 3 కిలోవాట్లకు మించి సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా గరిష్ఠంగా రూ.78వేలు మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తారు. 

ఉమ్మడిగానూ..

నివాసుల సంక్షేమ సంఘాలు, బృందంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారు ఉమ్మడి ప్రాంతంలోని విద్యుద్దీపాలు, వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల కోసం 500 కిలోవాట్ల వరకు రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఠాకుర్‌ చెప్పారు. ఇందుకోసం ఒక్కో కిలోవాట్‌కు రూ.18 వేల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఒక సౌర నమూనా గ్రామాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో బాగా పనిచేసే పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 2025 కల్లా దేశంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైనా రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుదుత్పత్తి వ్యవస్థ ఏర్పాటుచేస్తామని, రాయితీ మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే ఇస్తుందని తెలిపారు. ఈ పథకం వల్ల 17 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

  • Step 1: ముందుగా పీఎం సూర్యఘర్‌ (pmsuryaghar.gov.in) పోర్టల్‌లో పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి. ఇందుకోసం మీ రాష్ట్రం, విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. మీ విద్యుత్‌ కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీని ఎంటర్ చేయాలి.
  • Step 2: కన్జ్యూమర్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. అక్కడ ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం అప్లయ్‌ చేసుకోవాలి.
  • Step 3: దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్‌ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. 
  • Step 4: ఇన్‌స్టలేషన్‌ పూర్తయిన తర్వాత, ఆ ప్లాంట్‌ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
  • Step 5: నెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, డిస్కమ్‌ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు.
  • Step 6: ఈ రిపోర్ట్‌ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్‌ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని