Bitcoin: హ్యాకింగ్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగి ఆపై పతనమైన బిట్‌కాయిన్‌

బిట్‌కాయిన్‌ ఈటీఎఫ్‌లు అమెరికాలో కలకలం సృష్టించాయి. ఎస్‌ఈసీ ఖతా హ్యాకింగ్‌కు గురికావడమే దీనికి ప్రధాన కారణం.

Updated : 10 Jan 2024 10:12 IST

ఇంటర్నెట్‌డెస్క్: హ్యాకింగ్‌ కారణంగా బిట్‌కాయిన్‌ ధర మంగళవారం ఒడుదొడుకులకు గురైంది. అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఎక్స్‌ ఖాతాను సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) దుండగులు హ్యాక్‌ చేశారు. బిట్‌ కాయిన్‌ ఈటీఎఫ్‌లపై తప్పుడు పోస్టు పెట్టారు. ‘‘అన్ని రిజిస్టర్డ్‌ నేషనల్‌ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసుకోవడానికి బిట్‌కాయిన్‌ ఈటీఎఫ్‌లకు అనుమతి మంజూరు చేస్తున్నాం’’ అని దానిలో పేర్కొన్నారు. ఆ పోస్టు సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.

పిల్లల ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఫీడ్‌లో ఇక అవి కనిపించవు: మెటా

దీనిపై ఎస్‌ఈసీ ఛైర్మన్‌ గ్యారీ జెన్సలర్‌ తన వ్యక్తిగత ఎక్స్‌ ఖాతాలో స్పందించారు. ఎస్‌ఈసీ ఖతా హ్యాక్‌ అయినట్లు ప్రకటించారు. దానిలో తప్పుడు పోస్టు పెట్టినట్లు వివరణ ఇచ్చారు. బిట్‌కాయిన్‌ ఈటీఎఫ్‌లకు ఎస్‌ఈసీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఆ పోస్టును కూడా తొలగించామన్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.

వాస్తవానికి అమెరికాలో స్పాట్‌ బిట్‌కాయిన్‌ ఈటీఎఫ్‌లకు అనుమతిపై ఈ వారం ఎస్‌ఈసీ నుంచి కీలక ప్రకటన వస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. చాలా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఇప్పటికే దీనిపై ఎస్‌ఈసీకి పలు మార్లు విజ్ఞప్తి చేశాయి. అదే సమయంలో ఎక్స్‌లో పోస్టు రావడంతో మార్కెట్లో బిట్‌కాయిన్‌ ధర ఏకంగా 2,000 డాలర్లు పెరిగి.. 48,000 డాలర్లకు చేరింది. ఆ తర్వాత ఎస్‌ఈసీ ఛైర్మన్‌ వివరణతో తిరిగి 46,000 డాలర్లకు చేరుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని