Meta: పిల్లల ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఫీడ్‌లో ఇక అవి కనిపించవు: మెటా

Meta: టీనేజర్లకు హాని కలిగించే కంటెంట్‌ను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఫీడ్‌లో కనిపించకుండా నిలువరిస్తామని మెటా ప్రకటించింది.

Updated : 10 Jan 2024 11:35 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ఆత్మహత్య, స్వీయ హాని, అసాధారణ ఆహార అలవాట్లకు సంబంధించిన సమాచారం టీనేజర్ల ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్‌ (Facebook) ఖాతాల్లో కనబడకుండా చేస్తామని ప్రముఖ టెక్‌ సంస్థ మెటా (Meta) మంగళవారం తెలిపింది. చిన్న వయసు వారిపై ప్రతికూల ప్రభావం చూపించే సమాచారాన్ని ఇప్పటికే నియంత్రిస్తున్నామని పేర్కొంది. వారు అనుసరిస్తున్న ఖాతాల్లో ఆ తరహా కంటెంట్‌ ఉన్నా.. వాటిని ‘ఫీడ్‌’లో కనబడకుండా చేస్తామని వెల్లడించింది.

వయసు విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వకుండా తమ సామాజిక మాధ్యమాల్లోకి (Social Media) లాగిన్‌ అయ్యే చిన్న వయసు వారి ఖాతాలను ఇక నుంచి నియంత్రిత సెటింగ్స్‌లో ఉంచుతామని మెటా (Meta) స్పష్టం చేసింది. ఫలితంగా హాని కలిగించే సమాచారం కోసం వెతకడం కూడా కుదరదని వివరించింది.

ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) వల్ల యువకులు, చిన్న పిల్లల మానసిక స్థితికి హాని కలుగుతోందని అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి ఇటీవల ఆరోపణలు వచ్చాయి. పిల్లలు వాటికి అలవాటు పడేలా కంపెనీయే కావాలని కొన్ని ప్రత్యేక ఫీచర్లను రూపొందిస్తోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విమర్శకులు మాత్రం మెటా (Meta) తాజా చర్యలను కొట్టిపారేశారు. సామాజిక మాధ్యమాల నుంచి పిల్లల్ని దూరం పెట్టకుండా తల్లిదండ్రులను నిలువరించేందుకు ఇదొక ఎత్తుగడని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని