IT Refund: ‘ఐటీ రిఫండ్‌.. అని మెసేజ్‌ వచ్చిందా..?’: కేంద్రం హెచ్చరిక

ITR refund claims: ఐటీ రిఫండ్ల కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. దీనిపై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Updated : 04 Aug 2023 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మీకు ఐటీ రిఫండ్‌ వచ్చిందంటూ మెసేజ్‌ వచ్చిందా? దాంతో పాటు బ్యాంక్‌ ఖాతా సరిచేసుకోండి అంటూ ఏదైనా లింక్‌ పంపుతున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఐటీ రిఫండ్ల (ITR refund claims) కోసం ఎదురుచూస్తున్న వారినే లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘మీ బ్యాంక్‌ ఖాతా నంబర్ తప్పుంది.. వెంటనే సరిచేసుకోండి’ అంటూ మెసేజ్‌లు పంపుతూ డబ్బు కాజేయాలని చూస్తున్నారు. అసలే రిటర్ను మొత్తం ఖాతాలో జమ అయ్యే సమయం కావడంతో చాలా మంది నిజం అనుకొనే ప్రమాదం ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రిటీ రిటర్ను దాఖలు చేసిన వారిని హెచ్చరిస్తూ ఓ ట్వీట్‌ చేసింది.

‘ఆదాయపన్ను (IT) రిటర్నులు ఆమోదం పొందాయంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. ఇవన్నీ ఫేక్‌ మెసేజ్‌లు, ఆదాయ పన్ను శాఖ ఇలాంటి మెసేజ్‌లు ఎవ్వరికీ పంపదు. మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవటం కోసమే ఇలాంటి మెసేజ్‌లు పంపుతుంటారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ట్వీట్‌ చేసింది. దాంతో పాటూ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్‌ చేసింది.

రిఫండు రాలేదా?

వ్యక్తిగత వివరాలు తెలపాలంటూ ఐటీ శాఖ ఎలాంటి మెసేజ్‌/మెయిల్‌ పంపబోదని తెలిపింది. ఒక వేళ మీకు అలాంటి మెసేజ్‌ వస్తే లింక్‌పై క్లిక్‌ చేయటం కానీ, వ్యక్తిగత సమాచారాన్ని చేరవేయటం కానీ చేయకండి అంటూ హెచ్చరించింది. ఒక వేళ పొరపాటున లింక్‌పై క్లిక్‌ చేసినా ఎలాంటి సమాచారాన్ని ఎంటర్ చేయవద్దని.. ఆ లింక్‌ను కాపీ చేసి మరో బ్రౌజర్‌ వెతకటం వంటివి చేయకూడదని కేంద్రం సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని