IT Refund: రిఫండు రాలేదా?

ఆదాయపు పన్ను రిటర్నుల గడువు ముగిసింది. అయినప్పటికీ, అపరాధ రుసుముతో డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు.

Updated : 04 Aug 2023 07:06 IST

ఆదాయపు పన్ను రిటర్నుల గడువు ముగిసింది. అయినప్పటికీ, అపరాధ రుసుముతో డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారు ఇ-వెరిఫై చేస్తే ఆదాయపు పన్ను విభాగం ఆ రిటర్నులను ప్రాసెస్‌ చేస్తుంది. అర్హులైన వారికి రిఫండునూ అందిస్తుంది.

చెల్లించాల్సిన పన్నుకు మించి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించినప్పుడు రిటర్నులు సమర్పించి, రిఫండు కోరేందుకు వీలుంటుంది. సాధారణంగా రిటర్నులు దాఖలైన 7 రోజుల నుంచి 120 రోజుల్లోపు ఆదాయపు పన్ను విభాగం రిఫండును చెల్లిస్తుంది. గతంతో పోలిస్తే రిఫండు సమయం చాలా తగ్గింది. మీ రిఫండు పరిస్థితి ఏమిటన్నది ఆదాయపు పన్ను పోర్టల్‌లోకి లాగిన్‌ కావడం ద్వారా తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు రిఫండు చెల్లింపులో ఆలస్యం కావచ్చు. లేదా అందకపోవచ్చు. దీనికి కారణాలేమిటంటే..

  •  బ్యాంకు వివరాల నమోదులో పొరపాటు దొర్లినప్పుడు రిఫండు జమ కావడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. కాబట్టి, రిటర్నులలో మీ బ్యాంకు ఖాతా సరిగానే ఉందా లేదా చూసుకోండి.
  •  ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్నులను ప్రాసెస్‌ చేసే క్రమంలో అదనపు పత్రాలు లేదా వివరణల కోసం అడిగే అవకాశం ఉంది. ఐటీ పోర్టల్‌లోకి లాగిన్‌ అయి, ఒకసారి పరిశీలించండి. ఇ-మెయిల్‌లోనూ దీనికి సంబంధించిన సమాచారం పంపిస్తుంది.
  •  అధిక మొత్తం రిఫండు పొందేందుకు తప్పు క్లెయింలు చేసుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. మీ రిటర్నులపై అనుమానం వచ్చినప్పుడు, ఆదాయపు పన్ను విభాగం అదనపు పరిశీలనకు తీసుకుంటుంది. ఇలాంటప్పుడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
  •  మీరు చెల్లించిన టీడీఎస్‌/టీసీఎస్‌కూ రిటర్నులలో చూపించిన మొత్తానికీ వ్యత్యాసం ఉన్నప్పుడు రిఫండు విషయంలో ఆలస్యం జరుగుతుంది. మళ్లీ సరిచేసిన రిటర్నులను దాఖలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
  •  కొన్నిసార్లు రిటర్నులు ప్రాసెస్‌ అయినా ఆదాయపు పన్ను శాఖ నుంచి రిఫండు జమ కావడం ఆలస్యం కావచ్చు. లేదా బ్యాంకు దగ్గర సమస్య ఉండొచ్చు. ఈ సమస్య తాత్కాలికంగానే ఉంటుంది.

రిఫండు కోసం ఎదురుచూస్తున్న వారు ఎప్పటికప్పుడు ఇ-మెయిల్‌, ఆదాయపు పన్ను పోర్టల్‌ను తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని