Digital India Act: ఎన్నికల తర్వాతే డిజిటల్‌ ఇండియా యాక్ట్‌: రాజీవ్‌ చంద్రశేఖర్‌

Digital India Act: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిజిటల్‌ ఇండియా చట్టాన్ని తీసుకొచ్చేందుకు సమయం సరిపోదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated : 06 Dec 2023 19:30 IST

దిల్లీ: పాత ఐటీ చట్టం స్థానంలో ప్రవేశపెట్టాలనుకున్న డిజిటల్‌ ఇండియా చట్టం (Digital India act) ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్లే. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ చట్టం తీసుకొచ్చే అవకాశం లేదని కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. ఈ చట్టంపై పూర్తి స్థాయిలో చర్చలు జరపటానికి తగినంత సమయం లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు.

23 ఏళ్ల నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త డిజిటల్‌ చట్టాన్ని తీసుకురావాలని గత కొంత కాలంగా కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ టెక్నాలజీ సమావేశంలో రాజీవ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడారు. ప్రస్తుత ఐటీ చట్టంలో ఇంటర్నెట్‌ అనే పదమే లేదని ఆయన అన్నారు. అందుకే కొత్త చట్టం అవసరం ఉందన్నారు. ఈ చట్టానికి డిజిటల్‌ ఇండియా పేరు పెట్టామని, దీనికి సంబంధించి ముసాయిదా సిద్ధమైందన్నారు.

జనవరి 1 నుంచి సిమ్‌ కార్డుల జారీకి కొత్త రూల్‌

‘డిజిటల్‌ ఇండియా చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలంటే పూర్తి స్థాయిలో చర్చలు జరపడం ముఖ్యం. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేయడానికి తగిన సమయం లేదు. అందుకే  చట్టాన్ని తీసుకురావడం సాధ్యపడదు’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక, ఈ చట్టంలో ఆన్‌లైన్‌ విభాగంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. సోషల్‌మీడియాలో వచ్చే తప్పుడు వార్తల్ని నియంత్రించటంతో పాటు సైబర్‌ భద్రతను పెంచడం ఇందులో భాగం. మరోవైపు డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌పై త్వరలోనే సంప్రదింపులు ప్రారంభిస్తామని, డిసెంబర్‌, జనవరిలోనే నోటిఫై చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని