New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్‌ కార్డుల జారీకి కొత్త రూల్‌

New Sim card rule: సిమ్‌ కార్డుల జారీకి కొత్త రూల్‌ జనవరి 1  నుంచి అమల్లోకి రానుంది. ఇకపై పేపర్‌ విధానం కనుమరుగు కానుంది.

Updated : 06 Dec 2023 15:16 IST

SIM card | ఇంటర్నెట్‌ డెస్క్‌: సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం నిలిపివేసింది. దీని స్థానే జనవరి 1 నుంచి డిజిటల్‌ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది. దీనిపట్ల ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. దీనివల్ల సిమ్‌ కార్డుల మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్రం భావిస్తోంది.

ప్రస్తుతం సిమ్‌ కార్డుల జారీకి ఫారం నింపాల్సి ఉంటుంది. దీనికి గుర్తింపు పత్రాలు, ఫొటోలు జత చేయాలి. కొన్ని కంపెనీలు మాత్రం ఇప్పటికే డిజిటల్‌ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్‌గా మార్చనున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న కేవైసీ నిబంధనల్లో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు టెలికాం విభాగం ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. 2012 నుంచి అనుసరిస్తున్న పేపర్‌ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు అందులో పేర్కొంది.

డాట్‌ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల టెలికాం కంపెనీలకు మేలు జరగనుంది. పేపర్‌ లెస్‌ విధానం వల్ల కస్టమర్‌ను చేర్చుకునేందుకు ఆయా కంపెనీలకు అయ్యే ఖర్చు తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఇకపై ఆయా కంపెనీలు ఇకపై పూర్తిగా మొబైల్‌ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అలాగే సిమ్‌ కార్డు మోసాలు సైతం అరికట్టొచ్చని కేంద్రం భావిస్తోంది. సిమ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల్లో భాగంగా కొత్తగా ఈ డిజిటల్‌ విధానాన్ని తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని