Reliance- Disney: రిలయన్స్‌, డిస్నీ డీల్‌ ఖరారు.. ఒకే గొడుకు కిందకు 120 ఛానెళ్లు

Disney, Reliance deal: రిలయన్స్‌, డిస్నీల మధ్య విలీన ఒప్పందం కుదిరింది. ఈ రెండు సంస్థలు కలిసి అతిపెద్ద మీడియా జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయబోతున్నాయి.

Updated : 28 Feb 2024 19:59 IST

Disney- Reliance | దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వాల్ట్‌ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్‌ 18, స్టార్‌ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్‌ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్‌ గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఇరు సంస్థలు బుధవారం ప్రకటన విడుదల చేశాయి.

ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్‌ వెంచర్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 16.34 శాతం, వయాకామ్‌ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు దఖలు పడనున్నాయి. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వాల్ట్‌ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఉదయ్‌ శంకర్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉంటారు.

రిలయన్స్‌ నుంచి మరిన్ని డ్రింక్స్.. శ్రీలంక కంపెనీతో జట్టు

భారత వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి ఈ ఒప్పందం ద్వారా నాంది పలికినట్లు అయ్యిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మీడియా గ్రూప్‌గా ఉన్న డిస్నీతో వ్యూహాత్మక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. దీని వల్ల తమ వ్యాపారాభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు సరసమైన ధరకే కంటెంట్‌ను అందించడం వీలు పడుతుందని చెప్పారు. డిస్నీని రిలయన్స్ గ్రూప్‌లో కీలక భాగస్వామిగా సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రిలయన్స్‌తో ఒప్పందం ద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరించనున్నామని, ప్రేక్షకులకు నాణ్యమైన ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ కంటెంట్‌ను అందించడం వీలు పడుతుందని వాల్ట్‌ డిస్నీ సీఈఓ బాబ్‌ ఐగర్‌ పేర్కొన్నారు.

ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. 2024 చివరి త్రైమాసికంలో గానీ, 2025 తొలి త్రైమాసికానికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. విలీనానంతర సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. స్టార్‌ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్‌ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్‌స్టార్‌, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఉండనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని