ED Searches: వాషింగ్‌ మెషిన్‌లో నోట్ల కట్టలు కలకలం.. ఈడీ సోదాల్లో బహిర్గతం!

ఓ కేసులో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులకు ఊహించని రీతిలో వాషింగ్‌ మెషిన్‌లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి.

Published : 26 Mar 2024 22:35 IST

దిల్లీ: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో సోదాలు చేపట్టిన ఈడీ (Enforcement Directorate) అధికారులకు అనూహ్యంగా వాషింగ్‌ మెషిన్‌లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఈ ఘటనపై ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని అనుబంధ సంస్థలు.. బోగస్‌ సరకు రవాణా సేవలు, దిగుమతులు తదితరాల పేరిట షెల్‌ కంపెనీల సాయంతో సింగపూర్‌కు చెందిన రెండు సంస్థలతో రూ.1800 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి విశ్వసనీయ సమాచారం అందింది.

రహస్యంగా రూ.వందలకోట్ల ఆస్తి.. కుమారుడికి తెలియకుండా దాచిన తండ్రి..!

దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. క్యాప్రికార్నియన్ షిప్పింగ్- లాజిస్టిక్స్, దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామిల ఇళ్లతోపాటు అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతా, కురుక్షేత్ర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే రూ.2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంతమొత్తం వాషింగ్‌ మెషిన్‌లో దొరికిందని పేర్కొన్న ఈడీ.. దీనికి సంబంధించిన ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. వివిధ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, మొత్తం 47 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని తెలిపింది. అయితే, సోదాలు ఎప్పుడు జరిగాయి? ఆ నగదు ఎక్కడ పట్టుబడిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని