Elon Musk: ఎక్స్‌లో వీడియో గేమ్‌ స్ట్రీమింగ్‌.. కొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన మస్క్

ఎలాన్‌ మస్క్ మరో కొత్త ఫీచర్‌ను ఎక్స్‌లో పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

Published : 03 Oct 2023 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా యాప్‌ ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)ను సూపర్‌ యాప్‌గా మార్చేందుకు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఆడియో/వీడియో కాలింగ్‌, పిక్‌-ఇన్‌-పిక్‌ మోడ్ వంటి ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన మస్క్‌.. కొత్తగా మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేశాడు. దీంతో యూజర్లు వీడియో గేమ్‌లను ఎక్స్‌లో స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను మస్క్‌ స్వయంగా రెండుసార్లు పరీక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ ఖాతాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు సమాచారం.

‘‘ఎక్స్‌లో వీడియో గేమ్‌ స్ట్రీమింగ్ సిస్టమ్‌ను పరీక్షించాను. ఇది పనిచేస్తుంది’’ అని మస్క్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ట్విచ్‌, యూట్యూబ్‌కు ఎక్స్‌ గట్టి పోటీ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ట్విచ్‌ అనేది అమెజాన్‌కు చెందిన వీడియో గేమ్‌ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌. అలానే, యూట్యూబ్‌లో కూడా వీడియో గేమ్‌లను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. మరోవైపు వీడియో గేమ్‌ స్ట్రీమింగ్ ఎలా చేయాలో వివరిస్తూ ఎక్స్‌లో మీడియా ఇంజినీర్‌గా పనిచేస్తున్న మార్క్‌ కల్మాన్‌ వీడియోను తన ఖాతాలో షేర్ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని