Elon Musk: ఎలాన్‌ మస్క్‌కు ‘టెస్లా’ షాక్‌.. ఒక్క రోజే రూ.1.64లక్షల కోట్లు ఆవిరి

అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావానికి ప్రపంచ కుబేరుల్లో అగ్ర స్థానంలో ఉన్న ఎలాన్‌ మస్క్ (Elon Musk) సంపదలో ఒక్క రోజే రూ.1.64లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

Updated : 21 Jul 2023 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు భారీ షాక్‌ తగిలింది. టెస్లా షేర్ల భారీ పతనం (Tesla shares tumble)తో మస్క్‌ ఒక్కరోజే ఏకంగా 20.3 బిలియన్‌ డాలర్ల (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.64లక్షల కోట్లకు పైమాటే) సంపదను కోల్పోయారు. అయినప్పటికీ ఇంకా ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలను మరింత తగ్గించాలని యోచిస్తున్నట్లు టెస్లా (Tesla) ప్రకటించింది. వడ్డీ రేట్లు ఇలాగే కొనసాగితే విద్యుత్ వాహనాల ధరలను మరింత తగ్గించక తప్పదని మస్క్‌ (Elon Musk) వెల్లడించారు. దీంతో గురువారం నాటి అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్ల ధర భారీగా పతనమైంది. షేరు ధర ఏకంగా 9.7శాతం కుంగింది. దీంతో ఒక్కరోజే ఎలాన్‌ మస్క్‌ సంపదలో 20.3 బిలియన్‌ డాలర్లు ఆవిరయ్యాయి. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం మస్క్‌ మొత్తం నికర సంపద 234.4 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.

రూ. కోటి బీమా సరిపోతుందా?

ఈ ఏడాది జూన్‌లో ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ స్థాపించిన ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు భారీగా పతనమవ్వడంతో ఆయన సంపద తరిగిపోయింది. దీంతో మస్క్‌ మళ్లీ బెర్నార్డ్‌ను దాటి ప్రపంచ కుబేరుడి జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు టెస్లా షేర్ల నష్టంతో వీరిద్దరి సంపదల మధ్య వ్యత్యాసం తగ్గింది. అయినప్పటికీ మస్కే ఇంకా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ సూచీ ప్రకారం.. రెండో సంపన్నుడు బెర్నార్డ్‌ కంటే మస్క్‌ సంపద 33 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ఉంది.

గురువారం నాటి ట్రేడింగ్‌లో అమెరికాకు చెందిన నాస్‌డాక్‌ 100 సూచీ 2.3శాతం కుంగింది. దీంతో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌తో సహా లారీ ఎల్లిసన్‌ (ఒరాకిల్), స్టీవ్‌ బాల్మెర్‌ (మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ), మార్క్‌ జుకర్‌బర్గ్‌ (మెటా అధినేత), లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ల (ఆల్ఫాబెట్‌ సహ వ్యవస్థాపకులు) నికర సంపదలు కూడా భారీగా తరిగిపోయాయి. వీరంతా కలిసి ఒక్కరోజే 20.8 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని