రూ. కోటి బీమా సరిపోతుందా?

దురదృష్టవశాత్తూ ఒక వ్యక్తి మరణించినపుడు అతని కుటుంబానికి ఆర్థిక రక్షణను అందించేది టర్మ్‌ బీమా పాలసీ. మరి ఈ బీమా ఎంత ఉంటే మంచిది

Updated : 21 Jul 2023 00:37 IST

దురదృష్టవశాత్తూ ఒక వ్యక్తి మరణించినపుడు అతని కుటుంబానికి ఆర్థిక రక్షణను అందించేది టర్మ్‌ బీమా పాలసీ. మరి ఈ బీమా ఎంత ఉంటే మంచిది. రూ.కోటి మొత్తం ఎక్కువా తక్కువా? పరిశీలిద్దాం..

కుటుంబ పెద్ద దూరమైనప్పుడు ఆ లోటును తీర్చడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ, ఆ వ్యక్తి బాధ్యతలను పంచుకునేందుకు బీమా కొంత సాయం చేస్తుంది. చాలామంది ఇప్పటికీ తమ బీమా అవసరాల లెక్కలను తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. సరైన మొత్తం అంటే ఎంత ఉండాలి అనేది తెలుసుకున్నపుడే కుటుంబానికి ధీమా కల్పించినట్లు అవుతుంది.
తగినంత బీమాను లెక్కించడంలో వయసు కీలకం. మీరు 30 ఏళ్లలో ఉన్నట్లయితే.. మీ జీవిత బీమా మొత్తం వార్షికాదాయానికి కనీసం 20-25 రెట్లు ఉండాలి. కుటుంబ జీవన శైలి, అవసరాలు క్రమేణా పెరుగుతాయి. దశాబ్దాల పాటు ఆర్థికంగా కుటుంబానికి ఆర్థిక రక్షణ లభించాలి. కాబట్టి, ఈ మొత్తం తప్పనిసరి.
ఇక మీరు 40 ఏళ్లలో ఉంటే మీ బీమా మొత్తం వార్షికాదాయానికి కనీసం 10-15 రెట్ల వరకూ ఉండాలి. మీరు ఇలా లెక్కించుకున్నపుడు బీమా మొత్తం రూ. కోటి దగ్గరకు వెళ్తే.. ఆ మేరకు పాలసీని తీసుకోవచ్చు.
పదవీ విరమణ చేసే వయసు వరకూ మీ అప్పులు, కుటుంబ ఖర్చులకూ సరిపోయేలా జీవిత బీమా ఉండేలా చూసుకోవాలి. పాలసీదారుడు అకాల మరణం సందర్భంలో అతని/ఆమె ఆదాయాన్ని భర్తీ చేయడమే జీవిత బీమా పాలసీ ప్రధాన లక్ష్యం. కాబట్టి, ఆ విధంగా పాలసీ మొత్తం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
రూ.కోటి బీమా తీసుకుంటే చాలు.ఇబ్బందేమీ ఉండదు అని పూర్తిగా చెప్పలేం. మీపై ఆధారపడిన వారికి రూ. కోటి బీమా ఉపయోగకరమేనా లేదా అనేది చూసుకోవాలి.

* అప్పులు: రుణాలు లేదా ఆర్థిక బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రుణాలను చెల్లించేందుకు బీమా కవరేజీ సరిపోతుందా లేదా పరిశీలించాలి. అంటే, కుటుంబం అప్పుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నమాట.
* కుటుంబ అవసరాలు: జీవన వ్యయాలు, పిల్లల చదువులు మొదలైన ఖర్చులకు బీమా మొత్తం సరిపోతుందా చూడండి. రుణాలకు చెల్లించిన తర్వాత మిగులు ఇందుకు సరిపోవాలన్నది గుర్తుంచుకోండి.
* ఆదాయాన్ని భర్తీ చేయడం: కుటుంబం తన జీవన శైలిని నిర్వహించేందుకు ఎంత డబ్బు అవసరం? ఆధారపడిన వ్యక్తులు ఆర్థికంగా స్వతంత్రులు కావడానికి ఎంత సమయం పడుతుంది? ఈ ప్రశ్నలను వేసుకోవాలి. ద్రవ్యోల్బణం, ఇతర అనుకోని ఖర్చులనూ లెక్కించాలి.
* దీర్ఘకాలిక లక్ష్యాలు: పదవీ విరమణ కోసం పొదుపు చేయడం, కుటుంబానికి ఆస్తులను సమకూర్చడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను లెక్కించాలి. బీమా మొత్తం ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
* ప్రీమియం: బీమా ప్రీమియం క్రమం తప్పకుండా చెల్లించాలి. దీన్ని భరించగలరా ఆలోచించుకోవాలి. తగినంత బీమా రక్షణ, ప్రీమియం చెల్లింపు మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి.
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవసరాలను ఆలోచించి, కొన్ని లెక్కల ఆధారంగా మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అనేక ఉచిత కాలిక్యులేటర్లూ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని, సరైన బీమా విలువను తెలుసుకోవచ్చు.
బి.సతీశ్వర్‌, ఎండీ-సీఈఓ, ఏగాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని