Elon Musk: ట్విటర్‌ పేరును అందుకే మార్చాం: ఎలాన్‌ మస్క్‌

ట్విటర్‌ పేరును ఎక్స్‌గా ఎందుకు మార్చారనే దానిపై ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందించారు. భవిష్యత్తులో ఎక్స్‌ను సూపర్‌ యాప్‌గా మార్చాలనే ఉద్దేశంతో పేరు మార్చినట్లు తెలిపారు. 

Published : 25 Jul 2023 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు రోజుల క్రితం ట్విటర్‌ (Twitter) పేరును ఎక్స్‌ (X)గా మారుస్తూ.. ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ట్విటర్‌ బ్లూ బర్డ్ స్థానంలో కొత్త లోగోగా ఎక్స్‌ను తీసుకొచ్చారు. అయితే, మస్క్‌ ఎందుకు ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మార్చారనే దానిపై నెట్టింట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై ఎట్టకేలకు ఆయన స్పందించారు. ట్విటర్‌ను ఇకపై సూపర్‌ యాప్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘‘వాక్‌ స్వాతంత్య్రానికి గుర్తుగా ట్విటర్‌ను మార్చాలని ఎక్స్‌ కార్పొరేషన్‌ దాన్ని కొనుగోలు చేసింది. అందులో భాగంగానే ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మార్చాం. కేవలం పేరు మార్చుకోవడమే కాదు.. ఇకపై ట్విటర్‌ (ఎక్స్‌) అదే పనిచేస్తుంది. ట్వీట్‌కు 140 అక్షరాల పరిమితి ఉన్నప్పుడు ట్విటర్‌ అనే పేరు సరిపోతుంది. కానీ, ఇప్పుడు ఆ పేరు ఉండటంలో అర్థం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ట్విటర్‌ (ఎక్స్‌)లో ట్వీట్‌లు మాత్రమే కాదు పెద్ద సైజున్న వీడియోలు కూడా షేర్‌ చేయొచ్చు. మరికొద్ది నెలల్లో ట్విటర్‌ (ఎక్స్‌)లో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై యూజర్లు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇతర యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరంలేదు. ట్విటర్‌ (ఎక్స్)ను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చబోతున్నాం. ఇప్పటికే వీడియోలకు సంబంధించి కొత్త ఫీచర్లను పరిచయం చేశాం ’’ అని మస్క్‌ తెలిపారు. 

‘X.com’ గా ట్విటర్‌.. ఇక మస్క్‌ ఆలోచనలన్నీ ఇక్కడే..?

అయితే, పేరు మార్పు తర్వాత ట్విటర్‌ (ఎక్స్‌)లో షేర్‌ చేసే కంటెంట్‌ను ట్వీట్‌లు అని పిలవాలా? లేదా ట్వీట్‌లకు బదులు కొత్తగా ఏదైనా పేరును ప్రకటిస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. అలాగే, ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తరహాలో ఎక్స్‌లో అదనపు ఫీచర్ల కోసం కొత్తగా సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలనే దానిపై కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని