‘X.com’ గా ట్విటర్‌.. ఇక మస్క్‌ ఆలోచనలన్నీ ఇక్కడే..?

ట్విటర్‌ వెబ్‌సైట్‌ను ఎక్స్‌ డాట్‌ కామ్‌ (X.com)తో అనుసంధానం చేసినట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు.

Updated : 24 Jul 2023 15:39 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్‌ మస్క్‌.. సంస్థలో అనేక మార్పులకు ఉపక్రమించారు. ఉద్యోగుల తొలగింపు మొదలు.. బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్విటర్‌కు మారుపేరుగా నిలిచే పక్షి లోగో స్థానంలో తాజాగా ‘ఎక్స్‌’ను చేర్చిన ఆయన.. ట్విటర్‌ వెబ్‌సైట్‌ను కూడా ఎక్స్‌ డాట్‌ కామ్‌ (X.com)తో అనుసంధానం చేశారు. ఈ క్రమంలో మస్క్‌ మస్తిష్కంలో ‘ఎక్స్‌’కు ఉన్న ప్రాధాన్యాన్ని చూస్తే.. రానున్న రోజుల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్నంతా ‘ఎక్స్‌’ కార్పొరేషన్‌ ద్వారానే నిర్వహించేందుకు సిద్ధమవుతోన్నట్లు కనిపిస్తోంది.

‘ఎక్స్‌’ ప్రస్థానం అలా మొదలై..!

ఎలాన్‌ మస్క్‌కు ‘ఎక్స్‌’ అంటే విపరీతమైన ఇష్టం. 1990 నుంచే దాంతో మస్క్‌కు అనుబంధం ఉంది. 1999లో ఎలాన్‌ మస్క్‌  X.com పేరుతో స్టార్టప్‌ను స్థాపించారు. అనంతరం అది పేపాల్‌ (PayPal)గా చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే, 2017లో ఎక్స్‌ డాట్‌ కామ్‌ డొమైన్‌ను ఎలాన్‌ మస్క్‌ మళ్లీ కొనుగోలు చేశారు. ఆ సందర్భంగా స్పందించిన మస్క్.. తనకు ఎంతో సెంటిమెంటుగా ఉన్న ఆ డొమైన్‌ తిరిగి తన వద్దకు రావడం సంతోషంగా ఉందన్నారు. తిరిగి విక్రయించినందుకు పేపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతానికి దాన్ని వినియోగించే ప్రణాళిక ఏదీ లేదని.. ఎంతో సెంటిమెంట్‌ అని అప్పట్లో (2017 జులైలో) చెప్పారు. అప్పటి నుంచి ఎక్స్‌.కామ్‌ను వినియోగంలోకి తీసుకురాలేదు.

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం.. కేంద్రం ఓకే

అన్నింటా ఆ అక్షరం..

అనేక రంగాల్లో అడుగుపెట్టిన ఎలాన్‌ మస్క్‌.. అనేక కంపెనీల్లో X అక్షరం వచ్చేలా రూపొందించుకున్నారు. 2002లో అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రారంభించిన సంస్థ స్పేస్‌ఎక్స్‌ (SpaceX), ఎలక్ట్రిక్‌ కారు మోడల్‌ ఎక్స్‌ (Model X), చివరకు తన కుమారుల్లో ఒకరికి పెట్టిన పేరు (ఎక్స్‌ ఏఈ ఏXII)లోనూ ఎక్స్‌ అక్షరాన్ని వదల్లేదు. ఇక ఇటీవల ‘xAI’ పేరుతో కృత్రిమ మేధ సంస్థనూ స్థాపించారు. అయితే, ఇది మాత్రం తనకు సంబంధించిన ఇతర వ్యాపారాలతో సంబంధం లేకుండా కొనసాగుతుందని ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. తాజాగా ట్విటర్‌ పేరెంట్‌ సంస్థ పేరునూ ఎక్స్‌ కార్పొరేషన్‌గా పేర్కొన్నారు. దీంతో ట్విటర్‌ లోగోతోపాటు ట్విటర్‌.కామ్‌ స్థానంలో ఎక్స్‌.కామ్‌ (X.com) చేరిపోయింది. సోమవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్న మస్క్‌.. ‘ఎక్స్‌’తో కూడిన ప్రధాన కార్యాలయ ఫొటోనూ షేర్‌ చేశారు.

అన్నింటికీ ఒకే వేదిక..

సోషల్‌ మీడియా, పేమెంట్స్‌ వంటి సేవలన్నీ ఒకే యాప్‌లో కేంద్రీకృతమై ఉండే విధంగా ఓ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని ఎలాన్‌ మస్క్‌ అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా చైనాలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన టెన్‌సెంట్‌కు చెందిన వీచాట్‌ (WeChat) మాదిరిగా ఉండాలన్నది మస్క్‌ కోరిక. దాదాపు 100 కోట్ల మంది క్రియాశీల యూజర్లున్న వీచాట్‌ యాప్‌లో.. సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ నుంచి ఫుడ్‌ ఆర్డర్‌, క్యాబ్‌ సేవల వరకూ అన్ని సేవలను పొందవచ్చు. అందుకే దాన్ని ‘యాప్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌’గా పేర్కొంటుంటారు. ఇలా అన్ని సేవలు ఒకేచోట ఉండే ‘X’ యాప్‌ రూపొందించే ప్రక్రియ ట్విటర్‌ కొనుగోలుతో మరింత వేగవంతమైందని ఎలాన్‌ మస్క్‌ గత అక్టోబర్‌లో పేర్కొన్నారు.

ట్విటర్‌లో భారీ మార్పులతో ప్రత్యేక ముద్ర పడుతోందని.. తమ అనుసరించే విధానం కూడా మారిందని సంస్థ సీఈవో యకారినో పేర్కొన్నారు. ‘X’ తో ముందుకు వెళ్తామన్న ఆమె.. రానున్న రోజుల్లో సంస్థలో ఎన్నో మార్పులు వస్తాయన్నారు. భవిష్యత్తులో ఆడియో, వీడియో, మెసేజ్‌లు, పేమెంట్‌/బ్యాంకింగ్‌ వంటివన్నీ ఒకే వేదికపైకి రానున్నాయని.. తద్వారా ఐడియాలు, వస్తువులు, సేవలు, అవకాశాలకు విశ్వవేదికను సృష్టించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని