Artificial Intelligence: ‘మనకెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. ఏఐపై మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Artificial Intelligence: ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఈ అధునాతన సాంకేతికత ప్రభావం గురించి వివరించారు.

Updated : 24 May 2024 14:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ ప్రపంచంలో కృత్రిమ మేధ (Artificial Intelligence - AI ) సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తూనే.. మరోవైపు ఆందోళనకూ గురిచేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై టెక్‌ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలను నేటి యువతరం నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల.. ఏఐని మనుషుల్లా చూడడం ఆపాలని గట్టిగానే హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్యారిస్‌ కేంద్రంగా ‘వివా టెక్‌’ పేరిట నిర్వహించిన స్టార్టప్‌ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

రాబోయే రోజుల్లో ఉద్యోగం చేయడం ఒక వ్యాపకంగా మారుతుందని ఎలాన్ మస్క్‌ అభిప్రాయపడ్డారు. అన్ని ఉత్పత్తులు, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని అంచనా వేశారు. అదే జరిగితే మనకెవ్వరికీ జాబ్స్‌ ఉండకపోవచ్చునని వివరించారు. అవసరమైతే ఒక వ్యాపకంగా మాత్రమే ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు రావొచ్చని తెలిపారు. అయితే, ఆ స్థితికి చేరుకోవడానికి ప్రపంచంలో ప్రతిఒక్కరికీ ‘యూనివర్సల్‌ హై ఇన్‌కమ్‌’ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పరోక్షంగా అందరికీ పెద్ద మొత్తంలో ఆదాయం ఉండాలని సూచించారు. దీనిపై ఆయన మరింత లోతుల్లోకి మాత్రం వెళ్లలేదు.

‘ఏఐ’ని మనుషుల్లా చూడడం ఆపాలి: సత్య నాదెళ్ల

కొన్నేళ్లలో ఏఐ సామర్థ్యాలు గణనీయంగా మెరుగయ్యాయని మస్క్‌ (Musk) తెలిపారు. దీంతో ఈ అధునాతన సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కంపెనీలు, ప్రభుత్వాలు, నియంత్రణా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయని గుర్తుచేశారు. తనను వ్యక్తిగతంగా భయానికి గురిచేసేది ‘టెక్నాలజీ’ మాత్రమేనని చెప్పారు. ఇయాన్‌ బ్యాంక్స్‌ రాసిన ‘కల్చర్‌’ సిరీస్‌ పుస్తకాల్లో చూపించిన కల్పిత ప్రపంచం భవిష్యత్తులో ఆవిష్కృతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. 

ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మస్క్‌ ఓ కీలక సూచన చేశారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు గడిపే సమయాన్ని నియంత్రించాలని సూచించారు. వాటికి అలవాటుపడటం కోసం డోపమైన్‌ అనే హార్మోన్‌ను పెంచే విధంగా ఏఐతో ప్రోగ్రామ్‌ చేస్తున్నారని వెల్లడించారు. దీనిని ‘ఫీల్‌-గుడ్‌ హార్మోన్‌’గా వ్యవహరిస్తుంటారు. మనిషిలో ఆనందం, సంతృప్తి, ప్రేరణ వంటి భావాలకు ఇదే కారణమని వైద్యనిపుణులు చెబుతుంటారు. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిద్ర, సాధన, ఏకాగ్రత, కదలికల వంటి ఇతర శారీరక విధుల నియంత్రణలోనూ దీని పాత్ర ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు