Twitter: ట్విటర్‌లో 10 వేల పదాల లిమిట్‌.. వారికి మాత్రమేనా!

ట్విటర్‌ (Twitter) త్వరలో పొడుగు సందేశాల వేదికగా మారనుంది. ట్వీట్‌లో అక్షరాల పరిమితిని పెంచనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వెల్లడించారు. అయితే, ఇది అందరికీనా లేక కొందరికేనా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Published : 07 Mar 2023 01:28 IST

కాలిఫోర్నియా: ట్విటర్‌ (Twitter)లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్‌ అప్‌డేట్‌ అందుబాటులోకి రానుంది. ట్వీట్‌లో అక్షరాల పరిమితిని త్వరలో 10వేలకు పెంచున్నట్లు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తెలిపారు. దీంతో యూజర్లు ఒకే ట్వీట్‌లో ఎక్కువ టెక్ట్స్‌ను రాయొచ్చు. ట్విటర్‌లో ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ ఫీచర్‌ ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్ల (Blue Subscribers)కు మాత్రమేనా? లేక సాధారణ యూజర్లకు సైతం అందుబాటులో ఉంటుందా ? అనేది తెలియాల్సివుంది. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది. 

ప్రస్తుతం ట్విటర్‌లో ఒక ట్వీట్‌లో అక్షరాల పరిమితి 280గా ఉంది. గతంలో ఈ పరిమితి 140గా ఉండేది. 2017లో దాన్ని 280కి పెంచారు. గతేడాది నాలుగు వేల అక్షరాలకు పెంచారు. అయితే, ఇది కేవలం అమెరికాలోని ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా మస్క్‌ ప్రకటనతో మరోసారి ట్వీట్‌లో అక్షరాల సంఖ్య పెరగనుంది. మరోవైపు ట్విటర్‌ ఆదాయాన్ని పెంచేందుకు మస్క్‌ ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సబ్‌స్క్రిబ్షన్‌ రెవెన్యూ లేకుండా ట్విటర్‌ను కొనసాగించడం సాధ్యం కాదని, ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మస్క్ పేర్కొన్నారట.  అయితే, ట్విటర్‌ బ్లూ మాత్రం మస్క్‌ ఆశించినంతగా విజయం సాధించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో పది వేల అక్షరాల పరిమితి అందరికీనా లేక కొందరికేనా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని