Elon Musk: ‘ఎక్స్‌’లో లైక్‌ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!

Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్‌ మస్క్‌.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్‌ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

Updated : 16 Apr 2024 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టులకు ఛార్జ్‌ చేయడానికి ఎలాన్‌ మస్క్ (Elon Musk) సిద్ధమయ్యారు. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో కొత్త యూజర్లు చేసే పోస్ట్‌తో పాటు, లైక్‌, రిప్లయ్‌, బుక్‌మార్క్‌ చేయాలన్నా చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని బిలియనీర్‌ వెల్లడించారు. బాట్స్‌, నకిలీ ఖాతాల నివారణకు ఇది తప్పకపోవచ్చని సంకేతమిచ్చారు. ఫాలో, బ్రౌజింగ్‌ ఉచితంగానే చేయొచ్చని కంపెనీ పేర్కొంది.

‘ఎక్స్‌ డైలీ న్యూస్‌’ ఖాతా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు బదులిస్తూ మస్క్‌ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బాట్‌ల సమస్య నివారణ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న కృత్రిమ మేధ విధానాలు సమర్థంగా పనిచేయట్లేదని తెలిపారు. ‘క్యాప్చా’ వంటి పరీక్షలను చాలా సులువుగా అధిగమించగలుగుతున్నాయని చెప్పారు. దీంతో ఫీజును తీసుకొస్తామని పేర్కొన్నారు. కొత్త యూజర్లు ఫీజు చెల్లించకపోయినా ఎక్స్‌లో పోస్ట్‌ చేసేందుకూ అవకాశం ఇస్తామని మరొకరు అడిగిన ప్రశ్నకు మస్క్‌ (Elon Musk) బదులిచ్చారు. కానీ, అకౌంట్‌ క్రియేట్‌ చేసుకున్న తర్వాత కనీసం మూడు నెలలు వేచి చూడాలన్నారు. ఈ కొత్త విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు.

అక్టోబర్‌లోనే ‘ఎక్స్‌ సపోర్ట్‌’ దీనిపై అప్‌డేట్‌ ఇచ్చింది. న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో కొత్త ఖాతాలకు ఏడాదికి డాలర్‌ ఛార్జీ వసూలు చేసే విధానాన్ని  ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతాలకు చెందిన కొత్త యూజర్లు ఎక్స్‌లో పోస్ట్‌ను చూడగలరు. కానీ, రిప్లై, రీపోస్ట్‌, కొత్త పోస్ట్‌ రాయడం వంటి ఆప్షన్లు మాత్రం ఉండవు. దీన్నే ఇప్పుడు ఇతర ప్రాంతాలకూ విస్తరించే యోచనలో మస్క్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని