Elon Musk: మస్క్‌ను తండ్రే లూజర్ అన్నవేళ..వెలుగులోకి సంచలన విషయాలు

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌(Elon Musk) చిన్నతనంలో భయానక అనుభవాలు ఎదుర్కొన్నారట. అవి ఇప్పటికీ ఆయనపై ప్రభావం చూపుతున్నాయట.

Published : 06 Dec 2023 18:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), తన తండ్రి ఎర్రాల్ మస్క్‌ మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలున్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఎలాన్‌ మస్క్ జీవిత చరిత్ర పుస్తకంలో రచయిత ఐజాక్సన్ ఈ విషయాన్ని పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా వారి మధ్య బంధం గురించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన చిన్నతనంలో ఎదుర్కొన్న అనుభవాలు మస్క్‌ను ఇప్పటికీ వెంటాడుతున్నాయని, అవి మాయని మచ్చలా మిగిలిపోయాయని ఐజాక్సన్ పేర్కొన్నారు. 

‘మస్క్(Elon Musk) దక్షిణాఫ్రికాలో జన్మించారు. అతడు చిన్నప్పుడు బలహీనంగా ఉండేవాడు. అంత తెలివిగా కూడా కనిపించేవాడు కాదు. దాంతో పాఠశాలలో తోటి విద్యార్థుల నుంచి వేధింపులు ఎదుర్కొనేవాడు. ఎవరితోనూ త్వరగా కలిసిపోలేకపోయేవాడు. దాంతో ఆయనకు స్నేహితులు ఎవరూ ఉండేవారు కాదు. ఒక్కోసారి ఆ వేధింపుల వల్ల గాయపడేవాడు కూడా. కానీ ఒకసారి ఎదురైన అనుభవం మాత్రం ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. ఒకసారి జరిగిన ఘర్షణలో కొంచెం దెబ్బలు గట్టిగానే తగలడంతో నాలుగురోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి తనకు మద్దతుగా ఉండకపోవడం ఆయనను ఎంతో బాధించింది. తన తండ్రే తనను లూజర్ అని అనడం, తన తప్పువల్లే ఇలా జరిగిందని విమర్శించడాన్ని మస్క్‌ తట్టుకోలేకపోయాడు’ అని రచయిత ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

ఎలాన్‌ మస్క్‌ను చూసి ఏడ్చేసిన తండ్రి.. ఏడేళ్ల తర్వాత ఇరువురి భేటీ

మస్క్(Elon Musk) తన తండ్రితో మాట్లాడకపోవడానికి ఇలాంటి ఎన్నో కారణాలు దోహదం చేశాయట. ఇదిలా ఉంటే.. ఏడేళ్ల తర్వాత ఇటీవల మస్క్‌ తన తండ్రిని కలిశారు. ఎలాన్‌ను చూసి ఆయన తండ్రి ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారట. చివరిసారి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆయన తండ్రిని 2016లో కలిశారు. సోదరుడు కింబల్‌ మస్క్‌తో కలిసి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో తండ్రి 70వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని