Neuralink: మెదడులో చిప్‌తో వీడియో గేమ్‌ ఆడిన పక్షవాత బాధితుడు

Neuralink: ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ జనవరిలో మానవ మెదడులో చిప్‌ను అమర్చింది. పక్షవాతంతో బాధపడుతున్న సదరు వ్యక్తి తాజాగా ఎవరి సాయం లేకుండా వీడియో గేమ్‌ ఆడడం విశేషం.

Updated : 21 Mar 2024 11:30 IST

వాషింగ్టన్‌: మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలను చేపట్టిన న్యూరాలింక్‌ (Neuralink) నుంచి బుధవారం కీలక అప్‌డేట్‌ వచ్చింది. చిప్‌ను అమర్చిన వ్యక్తి నోలాండ్‌ అర్బాగ్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. పక్షవాతంతో బాధపడుతున్న ఆయనతో వీడియో గేమ్‌ సివిలైజేషన్‌ VI, చెస్‌ ఆడించింది. దాన్ని ‘ఎక్స్‌’లో లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. ఎవరి సాయం లేకుండా ఆయన గేమ్‌ ఆడినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను న్యూరాలింక్‌ సహ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు.

లైవ్‌ స్ట్రీమ్‌ సమయంలో అర్బాగ్‌ మాట్లాడారు. తన జీవితంలో ఇక చేయలేననుకున్న చాలా పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఈ అధునాతన సాంకేతికతలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని తెలిపారు. మరింత మెరుగుపరిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని వివరించారు. జీవితంలో తాను గేమ్స్‌ ఆడతానని ఊహించలేదన్నారు. కానీ, న్యూరాలింక్‌ (Neuralink) చిప్‌ వల్లే అది సాధ్యమైందని చెప్పారు. తన జీవితంలో ఇప్పటికే చాలా సానుకూల మార్పులు వచ్చినట్లు వెల్లడించారు. గంటలకొద్దీ వీడియో గేమ్స్‌ ఆడగలుగుతున్నానని తెలిపారు.

ఎనిమిదేళ్ల క్రితం అర్బాగ్‌ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెన్నెముక దెబ్బతినటంతో మెడ కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. కాళ్లు, చేతులు సొంతంగా కదల్చలేని పరిస్థితి. దీంతో తనకిష్టమైన వీడియో గేమ్స్‌ కూడా ఆడలేకపోయేవాడినని తెలిపారు. కానీ, చిప్‌ అమర్చిన తర్వాత గంటలకొద్దీ ఆడగలుగుతున్నానని చెప్పారు. ఎవరి సాయం లేకుండా కేవలం మెదడుతోనే ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇవ్వగలుగుతున్నానని వెల్లడించారు. చిప్‌ను తరచూ ఛార్జ్‌ చేయాల్సి రావడం ప్రస్తుతానికి ఉన్న ఒక పెద్ద పరిమితి అని తెలిపారు. వైర్‌లెస్‌ విధానంలో ఛార్జింగ్‌ చేస్తారు.

AI జనరేటెడ్‌ వీడియోలు గుర్తించడం ఇకపై సులువు..యూట్యూబ్‌ కొత్త రూల్స్‌

మానవ మెదడులో విజయవంతంగా చిప్‌ను అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్‌ ప్రకటించింది. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్‌- కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ (BCI) ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA)’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు చెప్పారు. దీని సాయంతో ఒక కోతి ‘పాంగ్‌’ వీడియో గేమ్‌ను ఆడింది.

ఎలా పనిచేస్తుందంటే..

న్యూరాలింక్‌ బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (BCI)లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్‌స్టాల్‌ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథమ్‌లుగా మారుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని